ప్రజాశక్తి – సాలూరు : ప్రజల సమస్యలకు క్షేత్రస్థాయిలోనే పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన జగనన్నకి చెబుదాం కార్యక్రమంలో ఆర్‌డిఒ కె.హేమలతతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ ప్రజల సమస్యలకు సత్వర పరిష్కార నిమిత్తం, ప్రజలు తమ సమస్యలు తెలియసేందుకు జిల్లా కేంద్రానికి రాకుండా, జిల్లా అధికారులే ప్రజలకు అందుబాటులో వచ్చేందుకు మండల స్థాయిలో జగనన్నకు చెబుదాం కార్యక్రమం ఏర్పాటు చేశారన్నారు. ఈ కార్యక్రమానికి 112 వినతులు రాగా, వాటిలో ఎక్కువగా ప్రజలు తమ గ్రామ సమస్యలు, బిటి రోడ్లు, గిరిజన, భూ సమస్యలు, వ్యక్తిగత సమస్యల పరిష్కారం గురించి వినతులు అందజేశారు. సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి అదేశాలు, సూచనలు చేశారు. మండలంలోని మారయ్యపాడు కొండపై ఉండడం వల్ల రోడ్డు సదుపాయం లేక గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, తాడిలోవ నుండి మారయ్యపాడుకి తారు రోడ్డు సదుపాయం కల్పించాలని గ్రామ సర్పంచ్ బి.రామ్మూర్తి, గ్రామస్తులు అర్జీ అందజేశారు. అలాగే తాగునీటి సదుపాయం కల్పించాలని కోరారు. బాగువలసకి పిహెచ్‌సికి నైట్ వాచ్‌మెన్‌ను నియమించాలని ఆర్.సురేష్ వినతి ఇచ్చారు. నెలిపర్తిలో సర్వేనెంబర్ 1-140, 141 గల భూమిని 40 కుటుంబాలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, ఈ భూమికి డి-పట్టా మంజూరు చేయాల్సిందిగా ఎల్.ప్రసాద్, గ్రామస్తులు కోరారు. శివరాంపురానికి చెందిన వెలగాడ థెరిస్సమ్మ సర్వేనెంబర్ 144-1 విస్తీర్ణంలో 0.08 సెంట్లు జిరాయితీ భూమిని ఆక్రమించారని, వారిపై చర్యలు తీసుకుని తన భూమి తనకు ఇప్పించాలని వినతి పత్రం సమర్పించారు. గుమడాం గ్రామానికి చెందిన కె.నారాయణమ్మ డి-పట్టా, బంజారు భూమిని ఆక్రమించి, ఆ భూమిపై ఉన్న చెట్టును నరికి వ్యవసాయం చేసుకున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని దరఖాస్తు అందజేశారు. సాలూరుకు చెందిన ఎస్.శాంతమ్మ అసంఘటిత కార్మికుల బీమా మంజూరు చేయవలసిందిగా దరఖాస్తు అందజేశారు. నెలపర్తికి చెందిన ఎం.వేలంగిని వితంతు పింఛను మంజూరు చేయాలని కోరారు. కరడవలస, కరడ కొత్తవలస, కొండ కొత్తూరు, సీడిబంద గ్రామాలో 12 విద్యుత్ స్తంభాలు వేయాలని కోరారు. డోయవరలో డిటిఆర్ ఫెయిల్ అయినందున కొత్త డిటిఆర్ ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో అన్నిశాఖల జిల్లా ఉన్నతాధికారులతో పాటు తహశీల్దార్ బాలమురళీకృష్ణ, ఎంపిడిఒ జి.పార్వతి, మున్సిపల్ కమిషనర్ టి.జయరాం ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.