ఓటరు జాబితాలో సమస్యలు ఉంటే పరిష్కరిస్తాం : కలెక్టర్‌

పార్వతీపురం: ఓటరు జాబితాలో సమస్యలు ఉంటే చెప్పండి… శత శాతం పరిష్కరిస్తామని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం తన కార్యాలయంలో ఎన్నికల అంశాల పట్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు, నిబంధనల మేరకు ఓటరు జాబితా సవరణ జరుగుతోందన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిని బాధ్యులను చేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో ఓటరు జాబితాపై ఎటువంటి అనుమానాలు, సంఘటనలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఇవిఎం తనిఖీలు పారదర్శకంగా జరిగాయని, ఎన్నికల కమిషన్‌ అధికారులు రేండమైజేషన్‌ చేస్తారని ఆయన పేర్కొన్నారు. సంచార వాహనాల ద్వారా ఓటరు అవగాహనఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషిన్‌ (ఇవిఎం)పై సంచార వాహనాల ద్వారా ఓటరు అవగాహన కల్పించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఓటరుకు పూర్తి స్థాయి అవగాహన లక్ష్యంగా అన్ని చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. సంచార వాహనాల్లో దృశ్య, శ్రవణ పరికరాలు ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. వాహనంలో ఒక అధికారిని కూడా నియమిస్తున్నట్లు చెప్పారు. ఒకే విధమైన ఫోటో ఉన్నట్లు గుర్తించినా, ఒకే ప్రాంతంలో ఒకే విధమైన ఓటర్లు ఉన్నట్లు గుర్తించినా ఎన్నికల కమిషన్‌ నిబంధనలు, ఆదేశాల మేరకు విచారణ చేయడం జరుగుతోందనిఅన్నారు. 6461 ఫారం – 6 దరఖాస్తులు, 5580 ఫారం – 7 దరఖాస్తులు, 10351 ఫారం – 8 దరఖాస్తులు విచారణ పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. జిల్లాలో ఇప్పటి వరకు 20251 ఓటర్లను చేర్చగా, 21573 ఓటర్లను తొలగించామని, 77018 ఓటర్ల వివరాల్లో చేర్పులు, మార్పులు జరిగాయని ఆయన చెప్పారు. 2,3 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదుడిసెంబరు 2,3 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం చేపడుతున్నట్టు కలెక్టర్‌ వివరించారు. 2024 జనవరి 1వ తేదీ నాటికి ఓటరుగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. యువత ఓటరుగా నమోదుకు ముందుకు రావాలని కోరారు. ఇప్పటి వరకు ఓటరుగా నమోదు చేసుకోని వారు, ఓటరు జాబితాలో పేరు లేని వారు ఓటరుగా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అక్టోబరు 27న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేశామని, ముసాయిదా ఓటరు జాబితాపై క్లైములు, అభ్యంతరాలను డిసెంబరు 9 వరకు స్వీకరిస్తున్నట్టు తెలిపారు. డిసెంబరు 26 నాటికి వాటిని పరిష్కరిస్తామని, 2024 జనవరి 5న తుది జాబితా ప్రచురణ సిద్ధం అవుతుందని స్పష్టం చేశారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం రోజుల్లో పోలింగ్‌ కేంద్రాల వద్ద బూత్‌ స్థాయి అధికారులు ఉంటారని పేర్కొన్నారు. ఒకేసారి పెద్ద ఎత్తున ఓటరు నమోదు దరఖాస్తులు స్వీకరించడం జరగదని స్పష్టం చేశారు. అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ జిల్లాలో ఓటరు నమోదులో ఎటువంటి సమస్యలు, లోపాలు లేవని చక్కగా సాగుతుందని అన్నారు. ఇవిఎంల మాక్‌పోల్‌కు అంతా హాజరయ్యామని, అవగాహన పొందామని తెలిపారు. సమావేశంలో డిఆర్‌ఒ జె.వెంకటరావు, కెఆర్‌ఆర్‌సి ఎస్‌డిసి జి.కేశవ నాయుడు, పర్యవేక్షకులు డి.రవికుమార్‌, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️