ప్రజాశక్తి-పార్వతీపురం : విద్యార్థులు విద్యావంతులుగా నిలవాలంటే విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, అది ప్రభుత్వ బాధ్యతని సిపిఎం పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు స్పష్టంచేశారు. జిల్లా విద్యారంగ సమస్యలపై ఎస్‌ఎఫ్‌ఐ నిర్వహిస్తున్న నిరసన దీక్షలు సోమవారం నాలుగో రోజుకు చేరాయి. ఈ దీక్షలకు సిపిఎం, టిడిపి, ఐద్వా, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా రెడ్డి వేణు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యలను బలహీన పరుస్తున్నాయని, దాన్ని తిరగరాసే శక్తి విద్యార్థులకే ఉందని తెలిపారు. నిత్యం అద్భుతంగా పాలన చేపడుతున్నామని గొప్పలు చెబుతున్న పాలకులు.. విద్యను అందుబాటులో తీసుకురావడంలో విఫలం చెందుతున్నారని విమర్శించారు. స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలైనా విద్య అందని ద్రాక్షలా మారిందని వాపోయారు. జిల్లా విద్యారంగ అభివృద్ధికి ఎస్‌ఎఫ్‌ఐ చేస్తున్న డిమాండ్లు న్యాయబద్ధమైనవని, తప్పకుండా ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.టిడిపి మాజీ ఎమ్మెల్యే బి.చిరంజీవులు మాట్లాడుతూ చదువు విద్యార్థి హక్కని, దాన్ని కల్పించడం ప్రభుత్వం బాధ్యతని స్పష్టంచేశారు. కానీ అటువంటిది రాష్ట్రంలో కరువైందని, భవిష్యత్తు విద్యార్థి పోరాటాలకు టిడిపి పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.ఉమామహేశ్వరి, ఐద్వా నాయకులు వి.ఇందిర, ఎస్‌ఎఫ్‌ఐ పూర్వ నాయకులు సిహెచ్ ముఖేష్ దీక్షలకు మద్దతు ప్రకటించారు. విద్యార్థుల పోరాటానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. దీక్షల్లో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి.రాజశేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు కె.,రాజు, నాయకులు శివ, గౌరీష్, ముఖేష్, ప్రదీప్, విద్యార్థులు పాల్గొన్నారు.