ఆశ్రమ పాఠశాలలో పిఒ తనిఖీలు

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం : మండలంలోని రేగిడి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఐటిడిఎ పిఒ విష్ణుచరణ్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రేగిడి బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు వండి పెడుతున్న వంటకాలను స్వయంగా పరిశీలించారు. మెనూ అమలు చేస్తున్నారా? ప్రతిరోజూ పెడుతున్న వంటకాలు రుచికరంగా ఉంటున్నాయా? లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పాఠ్యాంశాలపై ప్రశ్నలు అడిగి, సమాధానాలు రాబట్టారు. ఉపాధ్యాయులు సమయానికి పాఠశాలకు వచ్చి పాఠ్యాంశాలను బోధిస్తున్నారా? లేదా అని ఆరాతీశారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఆయన పాఠశాల స్టోర్‌రూమ్‌, రికార్డులను పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులకు సిలబస్‌పై అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఉన్న అటల్‌ టింకరింగ్‌ లేబ్‌ను పరిశీలించి కొన్ని సూచనలు చేశారు. అనంతరం ఆయన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రతిరోజూ ఎంత మంది రోగులు వచ్చి వైద్యాన్ని పొందుతున్నారో? అని అడిగి తెలుసుకున్నారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరాతీశారు. మందులు సకాలంలో వస్తున్నాయా? లేదా అని ఆసుపత్రి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

➡️