ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్ : ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలకు సోమవారం నుంచి నమోదు ప్రక్రియ ప్రారంభమైందని జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీల మస్కట్ (లోగో) పోస్టర్లను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబర్ 15వ తేదీ నుండి ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు ప్రారంభం అవుతాయన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖో ఖో, బ్యాడ్మింటన్ డబుల్స్ అంశాలలో పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ పోటీలు వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 3వ తేది వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ 13వ తేదీ వరకు రిజిస్ట్రేషను ప్రక్రియ సాగుతుందన్నారు. జిల్లాకు చెందిన 15 ఏళ్లు నిండిన స్త్రీ, పురుషులు అందరూ అర్హులేనని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. రిజిస్ట్రేషన్లు సమీప గ్రామ వార్డు సచివాలయం, వాలంటీర్ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. టోల్ ఫ్రీ నెంబర్ 1902, ష్ట్ర్‌్‌జూర://aaసబసaఎaఅసష్ట్రతీa.aజూ.స్త్రశీఙ.ఱఅ ద్వారా నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీలలో గెలుపొందిన వారికి నియోజకవర్గ స్థాయిలో రూ.35 వేలు, రూ.15 వేలు, రూ.5 వేలు ప్రథమ, ద్వితీయ తృతీయ బహుమతులుగా అందిస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా స్థాయిలో రూ.60 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు., రాష్ట్ర స్థాయిలో రూ.5 లక్షలు, రూ.3 లక్షలు, రూ.2 లక్షలు బహుమతులుగా అందిస్తారని వివరించారు. బాడ్మింటన్ పోటీలలో గెలుపొందిన వారికి నియోజకవర్గ స్థాయిలో రూ.20 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు ప్రథమ, ద్వితీయ తృతీయ బహుమతులుగా అందిస్తారని తెలిపారు. జిల్లా స్థాయిలో రూ.35 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు., రాష్ట్ర స్థాయిలో రూ.2 లక్షలు, రూ.లక్ష, రూ.50 వేలు బహుమతులుగా అందజేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి.విష్ణు చరణ్, జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు, కెఆర్‌ఆర్‌సి ఎస్‌డిసి జి.కేశవనాయుడు, డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ పి.కిరణ్ కుమార్, డిఇఒ ఎన్.ప్రేమ్‌కుమార్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి డి.మంజుల వీణ, క్రీడల చీఫ్ కోచ్ ఎస్.వెంకటేశ్వర రావు, ఆర్‌బిఎస్‌కె ప్రాజెక్టు అధికారి డి.భాస్కరరావు, డిపిఒ బి.సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ జె.రామ అప్పల నాయుడు తదితరులు పాల్గొన్నారు.