ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్ : జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి ప్రజల నుండి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి.విష్ణుచరణ్, జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు, కెఆర్‌సిసి డిప్యూటీ కలెక్టరు కేశవనాయుడుతో కలిసి ప్రజల నుండి వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో ప్రజలు పలు సామాజిక, వ్యక్తిగత అంశాలపై 136 అర్జీలు అందజేశారు. ఆ అర్జీల్లో కొన్ని… శ్రీ గుమ్మలక్ష్మీపురం మండలం పి.ఆమిటి గ్రామానికి అంగన్వాడీ భవనం మంజూరైనా, నిర్మాణం పూర్తి కాకపోవడం వల్ల చిన్నారులు విద్యావికాసానికి దూరం అవుతున్నారని, అన్ని వసతులతో పక్కా భవనం ఏర్పాటు చేయాలని ఆ గ్రామానికి చెందిన ఎన్.సునీత దరఖాస్తు అందజేశారు. శ్రీ పార్వతీపురం మండలం సంగంవలస గ్రామంలో కూరాకుల వీధిలో మంచినీటి సమస్య అధికంగా ఉందని, కొళాయిలు రాకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నామని, కాలువల్లో చెత్త నిండిపోవడం వల్ల అనారోగ్యం బారిన పడుతున్నామని కర్రి అప్పన్న, తదితరులు వినతి అందించారు. శ్రీ గరుగుబిల్లి మండలం గదబవలస గ్రామానికి అతి సమీపంలో అత్యం స్టోన్‌క్రషర్ ఉందని, అనుమతులకు విరుద్ధంగా రాత్రి సమయంలో క్రషర్ ఆడటం వల్ల ఇబ్బందులు పడుతున్నామని ఆ గ్రామస్తులు ఫిర్యాదుచేశారు. శ్రీ గుమ్మలక్ష్మీపురం మండలం పి.ఆమిటి గ్రామంలో సచివాలయ భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని కడ్రక శేషగిరి, గ్రామస్తులు దరఖాస్తు అందజేశారు. గుమ్మలక్ష్మీపురం మండలం కొండవాడు గ్రామంలో పోడు భూములకు ప్రభుత్వం సర్వే చేపట్టిందని, వెంటనే పట్టాలు మంజూరు చేయాలని ఎం.లక్ష్మి, తదితరులు కోరారు. శ్రీ గరుగుబిల్లి మండలం చిన్నగుడబ గ్రామానికి చెందిన పి.చంద్రశేఖరరావు సర్వేనెంబర్ 233లో తన భూమిని ఆక్రమించారని, తన భూమిని తిరిగి అప్పజెప్పాలని విన్నవించారు. కొమరాడ మండలం రామభద్రపురం గ్రామానికి చెందిన చింతాడ అమ్మడు తన భూమి ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీ పార్వతీపురం ఐటిడిఎకు రెగ్యులర్ డీడీని నియమించాలిన గిరిజన సంక్షేమ సంఘం, గిరిజన నిరుద్యోగ సంక్షేమ సంఘం నాయకులు టి.సాయిబాబు, పి.రంజిత్, బి.జనార్దన్ జెసికి వినతి అందించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డి.భాస్కరరావు, జిల్లా సివిల్ సప్లై అధికారి శివప్రసాద్, జిల్లా స్పోర్ట్స్ అధికారి వెంకటేశ్వర రావు, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి కె.శ్రీనివాసరావు, డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ పి.కిరణ్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కె.రాబర్ట్‌పాల్, జిల్లా మైనారిటీ అధికారి గయాజుద్దీన్, జిల్లా పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ, జిల్లా బిసి సంక్షేమ అధికారి ఎస్.కృష్ణ, ముఖ్య ప్రణాళికా అధికారి వీర్రాజు, జిల్లా విద్యా శాఖ అధికారి ప్రేమ్‌కుమార్, జిల్లా ప్రజా రవాణా అధికారి సుధాకర్, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.పరిష్కారం చూపని స్పందన జగనన్నకు చెబుదాం (స్పందన) కార్యక్రమం ద్వారా అర్జీదారులు ఇచ్చే వినతులకు ఎటువంటి పరిష్కారం దొరకడం లేదని పట్టణంలోని ఎనిమిదో వార్డు కౌన్సిలర్ కోరాడ నారాయణరావు తెలిపారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ 18 నెలల నుండి పట్టణంలో పలు సమస్యలపై ఎన్నో అర్జీలు పెట్టినా ఫలితం లేదన్నారు. ప్రజలకు సమయం వృథా తప్ప ప్రయోజనం లేదని అసంతృప్తి వ్యక్తంచేశారు.జీతాలు ఇప్పించండి అంగన్వాడీలకు మూడు నెలల నుంచి జీతాలు అందక నానా అవస్థలు పడుతున్నారని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.ఉమామహేశ్వరి, సిఐటియు జిల్లా నాయకులు వి.ఇందిర తెలిపారు. వెంటనే జీతాలు ఇప్పించాలని జెసి గోవిందరావుకు వినతిపత్రం అందజేశారు. ఇదే విషయంపై ఇప్పటికే పలుమార్లు ఐసిడిఎస్ పీడీ దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి ప్రయోజనమూ లేకుండా పోయిందని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు అంగన్వాడీల జీతాలను చెల్లించాలని కోరారు. యుటిఎఫ్ వినతి ఐటిడిఎలో పేరుకుపోయిన పలు సమస్యలకు పరిష్కారం చూపాలని యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు టి.రమేష్, ఎస్.మురళీ మోహన్‌రావు ఐటిడిఎ పిఒ సి.విష్ణు చరణ్‌కు వినతి పత్రం అందజేశారు. ఐటిడిఎ పరిధిలోని ఉపాధ్యాయుల ప్రమోషన్లు, అక్రమ డెప్యుటేషన్లు, పండిట్ అప్‌గ్రేడేషన్లు, మెనూ తదితర విషయాలపై విన్నవించారు. భాషా వాలంటీర్ల సమస్యలపై చేపట్టే ధర్నా నోటీసును అందించారు. ఈ సందర్భంగా పిఒ స్పందిస్తూ ప్రధానోపాధ్యాయుల, ఇతర ప్రమోషన్లు రెండు రోజుల్లోగా ఇస్తామని హామీనిచ్చారు.