అంగన్వాడీలకు అండగా ఉంటాం

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్‌ 8 నుంచి చేపట్టే సమ్మెకు పూర్తిమద్దతిస్తామని రాజకీయ పార్టీల, ప్రజా సంఘాల నాయకులు వెల్లడించారు. పార్వతీపురంలోని ఎన్‌జిఒ హోంలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు సరళ అధ్యక్షతన అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా సోమవారం రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.ఉమామహేశ్వరి మాట్లాడుతూ తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు చెల్లిస్తామని సిఎం జగన్‌ హామీ ఇచ్చి విస్మరించారని విమర్శించారు. అంగన్వాడీలకు గ్రాడ్యుటీ ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా అమలు చేయలేదన్నారు. మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చలేదని చెప్పారు. కేంద్రాల నిర్వహణకు అంగన్వాడీలు జీతం నుంచి పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రీ స్కూల్‌ పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు నాణ్యమైన సరుకులు అందివ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ సమస్యలపై అనేక ఆందోళనలు చేపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు. పైగా నిర్బంధాన్ని ఉపయోగిస్తూ పోరాటాలని అణచివేసే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలోనే డిసెంబర్‌ 8 నుండి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సెంటర్లను మూసివేసి, నిరవధిక సమ్మె చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు అంగన్వాడీలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు. టిడిపి నాయకులు సీతారాం మాట్లాడుతూ టిడిపి హయాంలో అంగన్వాడీలకు వేతనాలు పెంచి న్యాయం చేసినట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం అంగన్వాడీల సమస్యలపై చేపడుతున్న సమ్మెకు టిడిపి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. జనసేన పార్టీ నాయకులు వంగళ దాలినాయుడు మాట్లాడుతూ అంగన్వాడీలు న్యాయమైన సమస్యలపై చేపట్టే సమ్మెకు తామంతా అండగా ఉంటామన్నారు. సిపిఎం నాయకులు గొర్లి వెంకటరమణ, యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మురళీమోహన్‌, రైస్‌మిల్లు నాయకులు కృష్ణ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పడాల రాజశేఖర్‌, డివైఎఫ్‌ఐ జిల్లా నాయకులు ఎం.వెంకటరమణ, 108 నాయకులు వెంకటనాయుడు, శ్రామిక మహిళ నాయకులు వి.ఇందిర, అఖిల భారత గ్రామీణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పి.సంఘం, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కార్యదర్శి యమ్మల మన్మథరావు మాట్లాడుతూ సమ్మెకు మద్దతిస్తామని ప్రకటించారు. రౌండ్‌టేబుల్‌ సమావేశంలో అంగన్వాడీ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి గంట జ్యోతిలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.పాచిపెంట : అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రాజెక్టు అధ్యక్షులు టి.ప్రభావతి ఆధ్వర్యాన పాచిపెంట ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. సిఐటియ నాయకులు కోరాడ ఈశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ అంగన్వాడీలు చేస్తున్న న్యాయమైన పోరాటానికి ప్రజలంతా సంఘీభావం తెలపాలని కోరారు.

➡️