- నామినేషన్ రోజూ కీలక నేతలు దూరం
- నగరి నియోజకవర్గంలో గ్రూపుల పోరు
ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో : రాష్ట్ర మంత్రి ఆర్‌కె రోజా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని సవాల్ చేస్తున్నారు. అయితే సొంత పార్టీ వైసిపిలోనే ఆమెకు గత నాలుగేళ్లుగా అసమ్మతి సెగ వెంటాడుతూనే ఉంది. నగరి మున్సిపల్ ఎన్నికల్లో మొదలైన విభేదాలు అసెంబ్లీ ఎన్నికలొచ్చేసరికి తారాస్థాయికి చేరుకున్నాయి. శుక్రవారం రోజా నామినేషన్ సందర్భంగా నగరి వినాయకస్వామి ఆలయం వద్ద పూజలు చేశారు. అయితే కీలక నేతలు ఎవరూ ఆమె వెంట ఉండకపోవడం నియోజకవర్గంలో చర్చగా నిలిచింది. సొంత గూటిలో వాళ్లు వెంట లేకుండా, కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.
రెండు ఎన్నికల్లోనూ స్వల్ప మెజార్టీనే
2014, 2019 ఎన్నికల్లో రోజా స్వల్ప మెజార్టీతోనే గట్టెక్కారు. 2014లో మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడుతో తలపడ్డారు. 871 ఓట్ల తేడాతో హమ్మయ్యా అని బయటపడ్డారు. 2019లో ముద్దుకృష్ణమనాయుడు తనయుడు గాలి భానుప్రకాష్‌రెడ్డిపై పోటీచేసి 2,007 ఓట్లు తేడాతో గెలుపొందారు. వైసిపి అధికారంలోకి రావడంతో రోజా దశ తిరిగింది. ఎపిఐఐసి ఛైర్మన్‌గానూ, క్రీడా, టూరిజం శాఖ మంత్రిగానూ పనిచేశారు. ప్రస్తుతం నియోజకవర్గంలో ఇండియా వేదిక నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రాకేష్‌రెడ్డి బరిలో ఉన్నారు. అతనికి బంధువర్గం నగరి, పుత్తూరులో ఎక్కువగా ఉంది. అలాగే రోజా గెలుపునకు కృషి చేసిన రెడ్డివారి చక్రపాణిరెడ్డి, జడ్‌పిటిసి మురళీనాథరెడ్డి తమ సపోర్టు గాలి భానుప్రకాష్‌కే అని పరోక్షంగా ప్రకటించారు. అమ్ములు, వెంకటముని, లకీëపతి టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. పుత్తూరు, నగరి, విజయపురం, వడమాలపేట, నిండ్ర మండలాలు ఉండగా, మంత్రి రోజాకు గత ఎన్నికల్లో వడమాలపేట, నిండ్ర ఓట్లే ఎక్కువ మెజార్టీని తెచ్చాయి. దీంతో అప్పట్లో గట్టెక్కారు. అయితే ఈసారి అసమ్మతి సెగ ఈ మండలాల్లో ఎక్కువగా ఉంది. రెండు ఎన్నికల్లోనూ స్వల్ప మెజార్టీనే
మున్సిపల్ ఎన్నికలపుడు ముసలం
నగరి, పుత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో రోజా తన మార్కు రాజకీయాన్ని చాటుకున్నారు. ఛైర్మన్ గిరి.. పదవులు ఆశిస్తున్న సీనియర్లను పక్కన పెట్టి టిడిపి నుంచి వైసిపిలోకి వలసొచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంతో ముసలం ప్రారంభమైంది. నగరికి చెందిన పిజె కుమార్, శ్రీశైలం బోర్డు ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, వడమాలపేట జడ్‌పిటిసి మురళీనాథ్‌రెడ్డి, నిండ్ర సింగిల్ విండో ఛైర్మన్ లక్ష్మీపతి, వెంకటముని తదితర సీనియర్లను దూరం చేసుకున్నారు. జిల్లాలో కీలకంగా ఉన్న ఓ మంత్రి అసమ్మతిని పెంచి పోషించారన్న విమర్శలూ లేకపోలేదు. తనకు తెలియకుండానే తనను వ్యతిరేకిస్తున్న నిండ్రకు చెందిన రెడ్డివారి చక్రపాణిరెడ్డికి శ్రీశైలం ఛైర్మన్ పదవి ఇప్పించారని అప్పట్లో ఆర్‌కె రోజా గుర్రుమన్నారు. పుత్తూరుకు చెందిన హరికి మున్సిపల్ ఛైర్మన్ పదవి కట్టబెట్టారు. స్థానికంగా ఉన్న కౌన్సిలర్లు తామూ రేస్‌లో ఉన్నామని, వలసొచ్చిన వారికి ఛైర్మన్ గిరి కట్టబెట్టారని ఆమెపై నిరసన గళం విప్పారు. ఇలా మొదలైన అసమ్మతి పెరుగుతూ గత నాలుగైదు నెలలుగా ‘జగన్‌ను గెలిపిస్తాం.. రోజాకు టికెట్ ఇస్తే ఓడించి తీరుతాం’ అంటూ అసమ్మతి వర్గం బహిరంగంగానే ఘాటైన విమర్శలు చేస్తూ వచ్చింది. రోజాకు వ్యతిరేకంగా ధర్నాలు సైతం చేపట్టారు. ఓ దశలో రోజాకు టికెట్ డౌటేనని చర్చ నడిచింది. ఎట్టకేలకు రోజాకు టికెట్ లభించింది.