ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : ఈ నెల 2, 3 తేదీలలో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల నమోదు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు ఒక ప్రకటనలో తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అన్ని పోలింగ్ కేంద్రంలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఈ శిబిరాలలో సంబంధిత బూత్ స్థాయి అధికారులు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండి కొత్త ఓటర్ల నమోదు, తొలగింపులు, మార్పులు చేర్పులకు సంబంధించి 6, 7, 8 ఫారాలను అందించడంతోపాటు పూర్తిచేసిన ఫారాలను కూడా స్వీకరిస్తారన్నారు. 17-18 సంవత్సరాలు పైబడిన వారు కొత్త ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు.ఓటర్ల జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉన్నా కూడా దరఖాస్తులు అందజేయవచ్చన్నారు. ఇదివరకే ఓటర్ కార్డు కలిగిన వారు చేర్పులు, మార్పుల కోసం కూడా బూత్ స్థాయి అధికారులను సంప్రదించవచ్చన్నారు. ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తున్న ఈ ఓటర్ల నమోదు ప్రత్యేక శిబిరాలను అందరూ ముఖ్యంగా యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కోరారు.