సమస్యలపై సిహెచ్‌డబ్ల్యుల దీక్షలు ప్రారంభం
ప్రజాశక్తి – పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా)తమను ఆశా వర్కర్లుగా మార్చాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ (సిహెచ్‌డబ్ల్యులు) శుక్రవారం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటిడిఎ ఎదుట రిలే దీక్షలకు దిగారు. అల్లూరి జిల్లాలోని పాడేరు డివిజన్‌కు చెందిన 11 మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో పనిచేస్తున్న వారంతా ఈ దీక్షలకు కదిలివచ్చారు. దీక్షలను సిఐటియు జిల్లా అధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్ ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం దిగివచ్చే వరకూ పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. రిలే దీక్షలకు స్పందించకుంటే డిసెంబర్ 6 నుంచి నిరవధిక నిరాహార దీక్షలు చేపడతారని వెల్లడించారు. గిరిజన గ్రామాల్లో పనిచేస్తున్న సిహెచ్‌డబ్ల్యుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. ఆశా వర్కర్లతో సమానంగా పనిచేస్తున్నప్పటికీ రూ.4 వేలు మాత్రమే వేతనం ఇస్తుండడం శోచనీయమన్నారు. ఈ విషయాన్ని అనేకసార్లు ప్రభుత్వాధికారులకు విన్నవించినప్పటికీ స్పందన కరువైందన్నారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరల నేపథ్యంలో సిహెచ్‌డబ్ల్యులకు ఇస్తున్న వేతనం ఏమూలకూ సరిపోవడం లేదని తెలిపారు. ఇప్పటికైనా స్పందించి ఆశా వర్కర్లతో సమానంగా వేతనాలు, యూనిఫారం, సెల్‌ఫోన్, మెడికల్ కిట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఎల్.సుందరరావు, ఆశా వర్కర్ల సంఘం జిల్లా కార్యదర్శి వై.మంగమ్మ, కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల సంఘం నాయకులు కిల్లో పార్వతమ్మ, టి.మోదకొండమ్మ, జె.సావిత్రి, వి.కొండమ్మ, కె.చిన్ని, బి.లక్ష్మి పాల్గొన్నారు.