రథోత్సవంలో పాల్గొన్న ట్రస్టు సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు
పుట్టపర్తి అర్బన్ : పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా 98వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గురువారం నాడు ప్రశాంతి నిలయం స్వర్ణ రథోత్సవ వేడుకలను నిర్వహించారు. సాయంత్రం ఐదు గంటల నుంచి 6 గంటల వరకు ప్రశాంతి నిలయంలో స్వర్ణ రథోత్సవ వేడుకలు జరిగాయి. స్వర్ణ రథంపై సత్యసాయిబాబా చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ మందిరం చుట్టూ పురవీధుల్లో ఊరేగించారు. గతంలో సత్యసాయిబాబా రథంలో ఊరేగేవారు. ప్రస్తుతం బాబా చిత్రపట్టాన్ని రథంలో ఉంచి ఊరేగించే ఆనవాయితీని ట్రస్టు సభ్యులు కొనసాగిస్తున్నారు. స్వర్ణ రథాన్ని చూడటానికి ప్రజలు, భక్తులు, పర్యాటకులు పుట్టపర్తి వీధుల్లో బారులుదీరారు. అనంతరం సాయి కుల్వంత్ హాలులో సాయి విద్యార్థులు సంగీత కచేరి నిర్వహించారు. సత్యసాయి చిత్రపటాన్ని ఉయ్యాలలో ఉంచి జోలపాట పాడారు. స్వర్ణ రథోత్సవ వేడుకల్లో సత్యసాయి ట్రస్టు సభ్యులు రత్నాకర్‌తో పాటు యూనివర్సిటీ ఛాన్సలర్ చక్రవర్తి, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ గౌతమి, అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్ చేతన్, పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో పాటు సత్యసాయి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.