ఇసుక అక్రమ తవ్వకాలు అరికట్టండి

 ప్రజాశక్తి – పాలకొండ  :  పాలకొండ నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లే ఏకైక బ్రిడ్జి సంకిలి బ్రిడ్జి. ఈ బ్రిడ్జి సమీపంలో ఇసుక అక్రమ తవ్వకాలు జరపడం వల్ల బ్రిడ్జి కూలిపోయే ప్రమాదం ఉంది. గతంలో మైనింగ్‌ జియోలజీ విభాగాల వారు బ్రిడ్జిలకు సమీపంలో ఇసుక తవ్వకాలు జరపొద్దని పలుమార్లు ప్రభుత్వానికి, అధికారులకు హెచ్చరించినప్పటికీ మళ్లీ ఈ బ్రిడ్జి సమీపంలో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. ఈ బ్రిడ్జికి కొన్ని మీటర్ల దూరంలో పాలకొండ డివిజన్‌ కేంద్రానికి, సమీప ప్రాంతాలకు వెళ్లే తాగునీరుకి సంబంధించిన పంపు హౌస్‌ ఉన్నది. బ్రిడ్జి సమీప గ్రామాల ప్రజలకు సాగు, తాగునీరు కూడా ఇదే బ్రిడ్జి సమీపంలో నుంచి వెళ్లాల్సి ఉంది. ఇంత ప్రాధాన్యత గల ప్రాంతంలో ఇసుక అక్రమ తవ్వకాలు జరపడం వల్ల నదీ గర్భం కోతకు గురై దిగువునున్న గ్రామాలలోకి వరదల సమయంలో వరద నీరు గ్రామాల్లోకి వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాను అరికట్టి, ప్రజల ప్రాణాలను, ఆరోగ్యాలను కాపాడాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.ఇసుక అక్రమ రవాణాను అరికట్టండినాగావళి నది నుండి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని గోపాలపురం సర్పంచ్‌ జగదీష్‌తో పాటు గ్రామస్తులు గురువారం నాగావళి నదీ తీరంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ తవ్వకాల వల్ల వంతెనకు ప్రమాదం పొంచి ఉందన్నారు. ఈ విషయమై అధికారులకు తెలిసినప్పటికీ పట్టించుకోకుండా ఉండడం శోచనీయమన్నారు. అలాగే ఈ తవ్వకాల వల్ల తాగునీటి సమస్య ఎదురవుతుందన్నారు. నాగావళి నది నుంచి అనేక గ్రామాలకు నీటి సరఫరా అవుతుందని, అయితే ఈ తవ్వకాల వల్ల నీటి సరఫరాకు కూడా ఇబ్బందులు తప్పవని అన్నారు.

➡️