ప్రజాశక్తి-బొబ్బిలి : బిసిలు, ఎస్, ఎస్‌టిల సంక్షేమానికి వైసిపి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిన సామాజిక సాధికారత సాధిస్తుందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖా మంత్రి బూడి ముత్యాలు నాయుడు అన్నారు. సామాజిక సాధికార బస్సుయాత్ర సభకు వచ్చిన జనాన్ని చూస్తే బొబ్బిలి విజయం వైసిపికే సొంతమని అన్నారు. వైసిపి చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర సభ గురువారం సాయంత్రం శ్రీకళాభారతి జంక్షన్ లో ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ గత పాలకులు నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తే వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతోందని అన్నారు. 25 మంత్రి వర్గ స్థానాల్లో 17 వెనుకబడిన వారికి ఇచ్చారని చెప్పారు. మళ్లీ మోసపోకుండా రానున్న ఎన్నికల్లో వైసిపిని గెలిపించాలని కోరారు. మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించేందుకు అమ్మఒడి అమలు చేస్తున్నట్లు చెప్పారు. కార్పొరేట్ విద్యను ప్రభుత్వ విద్యా సంస్థలలో అందించేందుకు నాడు-నేడు అమలు చేస్తున్నామన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజులు నియోజకవర్గానికి ఏమి చేశారని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో రాజులు ఓటు కోసం వస్తే బుద్ది చెప్పాలని అన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే బొబ్బిలిని రెవెన్యూ డివిజన్ గా చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు 2014లో అమలు చేయకపోతే వైసిపి ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ ఇచ్చిందని చెప్పారు. చెరకు రైతులకు బకాయి బిల్లులు ఇప్పించిన ఘనత వైసిపిదేనని అన్నారు. ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ మహిళల ఆర్థికాభివృద్ధి కోసం చేయూత, ఆసరా పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ప్రజలందరికీ వైద్యం అందించేందుకు వైద్య రంగాన్ని ప్రభుత్వం బలోపేతం చేస్తుందని చెప్పారు. ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు మాట్లాడుతూ గత పాలకుల పాలనలో బొబ్బిలి నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందని చెప్పారు. సభలో మాజీమంత్రి పి.పుష్పశ్రీవాణి, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బడుకొండ అప్పలనాయడు, అలజంగి జోగారావు, ఎస్‌టి కమిషన్ చైర్మన్ స్వాతీరాణి, టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి, పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు పరీక్షిత్ రాజు, మున్సిపల్ చైర్మన్ సావు మురళి, శంబంగి వేణుగోపాలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.