ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఓ వ్యక్తి పోలీస్‌స్టేషన్ ఎదుట పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఘటన తిరుపతి జిల్లాలో కలకలం సష్టించింది. విజయవాడకు చెందిన మణికంఠ తమిళనాడు రాష్ట్రం తిరుత్తణికి చెందిన దుర్గని పెళ్లి చేసుకున్నాడు. వీరికి 8ఏళ్ల కుమార్తె, 5ఏళ్ల అభరు ఇద్దరు పిల్లలు ఉన్నారు. విజయవాడ నుంచి బతుకుతెరువు కోసం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. మూడునెలలు క్రితం భర్తతో విభేదించిన దుర్గా తిరుపతికి చేరుకుంది. భాకరాపేట చెందిన సోను అలియాస్ బాషాతో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరు కలిసి చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించే పగడాల శ్రీనివాసులు సహకారంతో భాకరాపేటలో మకాం పెట్టారు. విషయం తెలుసుకున్న భర్త మణికంఠ చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని కానిస్టేబుల్ శ్రీనువాసులను నిలదీశాడు. భార్యను వదిలేసి వెళ్లిపోవాలని… లేకుంటే దొంగతనం కేసుపెట్టి లోపలేస్తానని కానిస్టేబుల్ బెదిరించాడు. దీంతో మనస్తాపం చెందిన మణికంఠ స్టేషన్ పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ నుంచి 5 లీటర్లు తీసుకొచ్చి ఒంటిపై పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. మంటలతో అలాగే స్టేషన్లోకి వెళ్లి ఆర్తనాదాలు చేశాడు. పోలీసులు, స్థానికులు మంటలను ఆర్పారు. అందుబాటులో 108 అంబులెన్స్ లేకపోవడంతో పశు వైద్య సంచార వాహనంలో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు..