ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరిగే ధర్నాను జయప్రదం చేయండి

Nov 23,2023 16:02 #Guntur District, #Tadepalle
  •  కొలను కొండలో ఏపీ రైతు సంఘం మహాధర్నా కరపత్రాల ఆవిష్కరణ

ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్‌ : ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 27, 28 తేదీల్లో, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో జరిగే మహా ధర్నాను జయప్రదం చేయాలని, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకరరావు పిలుపునిచ్చారు. గురువారం ఎంటీఎంసీ పరిధిలోని కొలనుకొండలో రైతు సంఘం నాయకులతో కలిసి, మహాధర్నా కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివశంకరరావు మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక, కర్షక ప్రజావ్యతిరేక విధానాలను అమలు చేస్తుందన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ ప్రజా వ్యతిరేక విధానాల వలన అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని.. ప్రధానంగా వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు మోడీ ప్రభుత్వం పూనుకుందన్నారు. అందులో భాగంగానే బిజెపి ప్రభుత్వం మూడు నల్ల చట్టాలు తీసుకువచ్చిందని, దేశవ్యాప్తంగా రైతులు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా మహా ఉద్యమం చేశారన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చి ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలలో పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు విపరీతంగా పెంచారని ఆయన మండిపడ్డారు. నిత్యవసర వస్తువులు ధరలు ఆకాశాన్ని అంటుతున్న ధరలను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆయన దుయ్యబట్టారు. అదేవిధంగా కార్మికుల పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్‌ కోడ్‌ లుగా మార్చి, కార్మికుల పొట్ట కొట్టిందని ఆయన అన్నారు. దీనివలన యావత్‌ కార్మిక రంగం అనేక రకాలుగా ఇబ్బందులు పడుతుందని అన్నారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ కంపెనీలకు అమ్మేందుకు నరేంద్ర మోడీ పూనుకోవడం వలన, వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకు పోయిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని ప్రైవేటు పరం చేసేందుకు కేంద్ర బిజెపి ప్రభుత్వం పూనుకోవడంతో పారిశ్రామిక రంగం కుదేలైంది అన్నారు. ఒకపక్క పారిశ్రామిక రంగం , మరోవైపున వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన ఆవేదన చెందారు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్‌ మీటర్లు పెట్టే ప్రక్రియను దేశవ్యాప్తంగా రైతులు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. విద్యుత్‌ మోటార్లకు స్మార్ట్‌ మీటర్లు పెట్టే విధానాన్ని తీసివేయాలన్నారు. అదేవిధంగా రైతుల పండించిన పంటలన్నిటికీ, మద్దతు ధర కల్పిస్తూ, సీటు ప్లస్‌ 50% (ఎం. ఎస్‌ .పి) చట్టం చేయాలన్నారు. నాలుగు లేబర్‌ కోడ్‌ ల ను ఎత్తివేసి, కార్మికులకు పని ప్రదేశాలలో భద్రత కల్పించాలన్నారు. అంతేకాకుండా కౌలు రైతులతో పాటు రైతులందరికీ స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం పంట రుణాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు. కనీస వేతనం 26,000గా నిర్ణయించి, కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌, డైలీ వేజ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలన్నారు. అదేవిధంగా ఉపాధి హామీ పని దినాలను 200 రోజులు చేసి, కనీస వేతనం 600 రూపాయలు నిర్ణయించి, ఉపాధి కల్పించాలని తదితర డిమాండ్లతో ఈ నెల 27వ తేదీన విజయవాడలో జరుగు కర్షక, కార్మిక మహాధర్నాను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం రైతు సంఘం నాయకులు కరపత్రాలు విస్తతంగా పంపిణీ చేసి, ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం తాడేపల్లి మండల నాయకులు దొంతి రెడ్డి వెంకటరెడ్డి, కాట్రగడ్డ శివరామకృష్ణయ్య, కాట్రగడ్డ శివన్నారాయణ, కొడవటి రమేష్‌, దాసరి సురేష్‌, సాంబయ్య కార్మికుల తదితరులు పాల్గొన్నారు.

➡️