ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : జిల్లాలో ఉన్న పేదల భూసమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ఆధ్వర్యంలో నాయకులు డిఆర్‌ఓ పెంచల కిషోర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని పలు మండలాల్లో పేదలు సాగుచేస్తున్న భూములను, పట్టాలు పొందిన వారి నుండి పరిశ్రమ అధిపతులకు అప్పగించడం అనే సాకుతో స్వాధీనం చేసుకోవడం నుండి కాపాడాలని డిమాండ్ చేశారు. ఓజిలి, చిట్టమూరు, కెవిబిపురం, బిఎన్.కండ్రిగ మండలాలకు చెందిన పలు గ్రామాల నుంచి దళితులు, గిరిజనులు తమ భూములకు హక్కు కల్పించాలని, ఆక్రమణదారుల నుంచి రక్షణ కల్పించాలని అర్జీలు సమర్పించడం జరిగిందన్నారు. ఓజిలి మండలంలో గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు ఇప్పటివరకు సర్వే చేసి పట్టాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని, 2 ఎకరాలపైగా భూములు ఉన్నప్పటికీ గిరిజనులకి అందకుండా చేస్తున్నారని ఆరోపించారు. అలాగే మాచవరం గ్రామంలో 25సంవత్సరాల క్రితం ఇచ్చిన పట్టా భూములకు పశువుల మేత భూమిని నుండి దళితులను వెళ్లగొట్టడానికి కుట్ర చేస్తున్నారని అన్నారు. చిట్టమూరు మండలంలో పేరంటాలమెట్ట గ్రామానికి చెందిన దళితులు గిరిజనుల బలహీన వర్గాల భూములను సిజేఎఫ్‌ఎస్ భూములకు పట్టాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. అలాగే కెవిబి పురంలోని పలు గ్రామాలకు చెందిన ఇళ్లస్థలాల సమస్యలు భూసమస్యలను అధికారుల దష్టికి తీసుకొచ్చారు. బిఎన్ కండ్రిగ మండలంలో నెలవాయి గ్రామంలో హైస్కూల్ స్థలం ఆక్రమణలకు గురైన విషయంగా అధికారులు దష్టికి తీసుకురావడం జరిగిందని, సత్యవేడు మండలం దళితురాలు తమ భర్తను పెత్తందారులు హత్య చేసినప్పటికీ కేసు నమోదు చేయక ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమస్యల మీద ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ మండల స్థాయి అధికారులు పరిష్కరించడం లేదని వాపోయారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దాసరి జనార్ధన్, నాయకులు హేమలత, లక్ష్మి, ధనంజయలు తదితరులు పాల్గొన్నారు.