అన్ని శాఖల సమన్వయంతో బ్రహ్మోత్సవాలు విజయవంతం: టిటిడి ఛైర్మన్‌

Nov 19,2023 00:15 #Tirupati district

 

అన్ని శాఖల సమన్వయంతో బ్రహ్మోత్సవాలు విజయవంతం: టిటిడి ఛైర్మన్‌

ప్రజాశక్తి- తిరుపతి (మంగళం): తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన పంచమి తీర్థం విశిష్టతను పురస్కరించుకొని అన్ని శాఖల సమన్వయంతో చివరి ఘట్టాన్ని విజయవంతంగా నిర్వహించగలిగామని టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు. శ్రీపద్మావతి అమ్మవారి పంచమితీర్థం సందర్భంగా తిరుచానూరులోని పద్మసరోవరానికి అశేష సంఖ్యలో భక్తులు తరలి వస్తారని, భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసింది. శాస్త్రోక్తంగా నిర్వహించే పంచమితీర్థ వేడుకలను భక్తులు వీక్షించేలా టీటీడీ ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేసింది. సుదూర ప్రాంతాల నుండి పంచమి తీర్థం ఘట్టాన్ని వీక్షించి, పుణ్యస్నాలను ఆచరించే భక్తుల కోసం వాహనాల పార్కింగ్‌, క్యూలైన్లను పకడ్బందీగా అధికారులు ఏర్పాటు చేశారు. దాదాపు 50వేల మంది భక్తులు పంచమితీర్థం సందర్భంగా పద్మసరోవరంలో పుణ్యస్నానాలను ఆచరించారని టీటీడీ అధికారులు తెలిపారు. పంచమితీర్థం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి అమ్మవారికి సారెను ఊరేగింపుగా తీసుకొచ్చి స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వహించారు. పద్మావతి అమ్మవారి ఉత్సవ విగ్రహానికి, చక్రత్తాళ్వార్‌లకు స్నపన తిరుమంజనం అనంతరం 12 నుండి 12.10గంటల మధ్యకాలంలో చక్రస్నాన ఘట్టాన్ని నిర్వహించారు. టిటిడి ఈవో ఏవి ధర్మారెడ్డి పర్యవేక్షణలో శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయని టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి తెలిపారు. పంచమీ తీర్థం సందర్బంగా తిరుమల శ్రీవారి కానుకగా రూ.2.5కోట్లు విలువైన 5కిలోల బరువు గల బంగారు కాసులమాల, శ్రీసుందరరాజస్వామి వారికి యజ్ఞోపవీతాన్ని సారెతో పాటు తిరుపతి పురవీధులలో ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించారు.
ఆకట్టుకున్న పుష్ప అలంకరణ…
పంచమితీర్థం సందర్భంగా పంచమి మండపాన్ని ఒక టన్ను పుష్పాలతో విశేషంగా అలంకరించారు. ఇందులో తామర పూలు, రోజాలు, లిల్లీలు తదితర 6 రకాల, కట్‌ ఫ్లవర్స్‌, 6 రకాల సంప్రదాయ పుష్పాలతో ఉద్యానవన సిబ్బంది అత్యంత సుందరంగా అలంకరించి తీర్చిదిద్దారు. ఈ పుష్పాలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
అన్నదానం చేసిన రామచంద్రారెడ్డి…
శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని తిరుచానూరు గ్రామపంచాయతీ సర్పంచ్‌ కీరకట్టు రామచంద్రారెడ్డి నేతత్వంలో పంచమితీర్థం సందర్భంగా వచ్చే భక్తులకు ఎక్కడ అన్న పానీయాలకు ఇబ్బందులు ఎదుర్కోకుండా తన సొంత నిధులను ఖర్చు చేసి దాదాపు 42 వేల మందికి అల్పాహారంతో పాటు అన్నదానం చేశారు. ఈ అన్నదానం కార్యక్రమాన్ని నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, తుడా చైర్మన్‌ చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై భక్తులకు అన్నదానం చేశారు. సర్పంచి రామచంద్రారెడ్డి గత తొమ్మిది సంవత్సరాలుగా అమ్మవారి బ్రహ్మౌత్సవాలకు భక్తులకు అన్నదానం చేయడం ఆనవాయితీగా వస్తోందని, శుక్రవారం రాత్రి 7వేల మంది భక్తులకు అల్పాహారం, 10 వేల మందికి శనివారం ఉదయం అల్పాహారంతో పాటు 25వేల మంది భక్తులకు అన్నదానం చేశారు. శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌ స్వామి, బోర్డు సభ్యులు, జేఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్‌వో నరసింహ కిషోర్‌, ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి, ఎస్వీబీసీ సీఈఓ షణ్ముఖ్‌ కుమార్‌, సీఈ నాగేశ్వరరావు, డెప్యూటీ ఈవోలు గోవిందరాజన్‌, లోకనాథం, సర్పంచ్‌ కె.రామచంద్రరెడ్డి, శివాలయం ఛైర్మన్‌ శ్రీధర్‌రెడ్డి, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, ఇతర అధికారులు భక్తులు పాల్గొన్నారు.
తిరుచ్చిపై ఊరేగిన పద్మావతి అమ్మవారు.. రాత్రి 9:30 గంటలకు శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో తొమ్మిది రోజులపాటు జరిగిన అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం రాత్రి 7:30 గంటలకు అమ్మవారు బంగారు తిరుచ్చిలో ఆలయ నాలుగు మాడవీధులు విహరించి భక్తులను కటాక్షించారు. రాత్రి 9.30 గంటలకు ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించనున్నారు. గజపటాన్ని అవనతం చేసి ధ్వజారోహణం నాడు ఆహ్వానించిన సకల దేవతలను సాగనంపడంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి. బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకునే వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమద్ధితో తులతూగుతారని ఐతిహ్యం. విషమత్యు నాశనం, రాజ్యపదవులవంటి సకల శ్రేయస్సులు పొందుతారని విశ్వాసం. జేఈవో వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో గోవిందరాజన్‌, ఏఈఓ రమేష్‌, వీజీవో బాలిరెడ్డి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

➡️