టాప్ ఇన్స్‌పెక్టర్‌ను ప్రశ్నిస్తున్న కార్మికులు
అనంతపురం కార్పొరేషన్ : అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌లో పనిచేసే అవుట్‌సోర్సింగ్ వాల్వ్ ఆపరేటర్ గోపాల్ రెడ్డి గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈయన్ను పరామర్శించి, చికిత్సకు అవసరమయ్యే సహకారం అందించాల్సిన ఆ శాఖ అధికారులు ఇందుకు విరుద్ధంగా కార్మికుడు హాజరుపట్టికలో ఆబ్సెంట్ మార్కు వేసి కార్మికులపై వారికి ఏపాటి ప్రేమ ఉన్నదో చాటుకున్నారు. కార్మికునికి హాజరుపట్టికలో గైర్హాజరు వేయడాన్ని నిరసిస్తూ కార్పొరేషన్ ఇంజినీరింగ్ సెక్షన్‌లో మున్సిపల్ ఉద్యోగ కార్మిక యూనియన్ నాయకులు మల్లికార్జున, సంజీవరాయుడు మాట్లాడుతూ టాప్ ఇన్స్‌ప్పెక్టర్ మహబూబ్ బాషాను నిలదీశారు. గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుని పట్ల ఇలా వ్యవహరించడం సరికాదంటూ అధికారికి తెలిపారు. కార్పొరేషన్‌లో వర్కర్ ప్రమాదాలకు గురైనా, మరణించినా అధికారులు ఎవరూ స్పందించడం లేదన్నారు. ఆ కుటుంబానికి ఒక్క పైసా కూడా సాయం చేసిన దాఖలాలు లేవన్నారు. తోటి వర్కర్లే తలా కొంత మొత్తాన్ని పోగుచేసి కార్మిక కుటుంబానికి అండగా నిలుస్తున్నామన్నారు. సహాయం చేయకపోతే పర్వాలేదు కానీ ఇలా కార్మికుడు మరింత ఇబ్బంది పడేలా కక్షపూరితంగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదన్నారు. కోర్టు కేసుల్లో ఉండి నెలల తరబడి ఉద్యోగాలకు రాకున్నా వారికి హాజరు వేసి, అనారోగ్యంతో చికిత్స పొందుతున్న కార్మికునికి గైర్హాజరు వేయడం అత్యంత దుర్మార్గం అన్నారు. విధులు పట్ల అంకితభావంతో పని చేసే గోపాల్‌రెడ్డి లాంటి కార్మికుని అండగా నిలవాలని హితవు పలికారు. కార్మికుల ఆందోళన సమయంలో వాటర్ వర్క్స్ డిఈఈ సుభాష్ అక్కడికి చేరుకుని కార్మికులకు సర్ధిచెప్పారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గోపాల్ రెడ్డికి పది రోజులకు హాజరు వేసేలా ఆయన ఒప్పుకున్నారు. దీంతో కార్మికులు ఆందోళన విరమించారు.