ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ :పంట నష్టపరిహారం, ఇతర వ్యవసాయ అనుబంధ సమస్యల పరిష్కారం కోరుతూ అనంతపురం కలెక్టరేట్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో రైతులు బుధవారం ధర్నా నిర్వహించారు. అంతకుముందు ఎండిపోయిన పత్తి, కంది, వేరుశనగ పంటలతో నగరంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. వర్షాభావంతో అనంతపురం జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించినా కరువు సహాయక చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో వర్షాభావంతో పంటలన్నీ పూర్తిగా చేతికందకుండా పోయాయని, ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రతి రైతుకూ స్కేల్‌ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఎకరాకు గరిష్టంగా రూ.50 వేలు, వర్షాభావం వల్ల విత్తనం కూడా వేయలేని రైతులకు ఎకరాకు రూ.30 వేలు పరిహారం ఇవ్వాలని కోరారు. రైతు, కౌలురైతు, వ్యవసాయ కార్మిక కుటుంబాల విద్యార్థుల అన్ని రకాల ఫీజులను రద్దు చేయాలన్నారు. వలసలను నివారించేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద 200 రోజులు పని కల్పించి రోజుకు రూ.600 వేతనం ఇవ్వాలని, పంట సాగుచేసిన కౌలు రైతులకే పంట నష్టపరిహారం ఇవ్వాలని, రైతుల బ్యాంకు అప్పులన్నింటినీ మాఫిచేసి కొత్త రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని డిఆర్‌ఒ గాయత్రీదేవికి అందజేశారు. ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఓ.నల్లప్ప, బాలరంగయ్య, జిల్లా కమిటీ సభ్యులు రామిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.