సంతకాలు సేకరిస్తున్న కెవిపిఎస్ నాయకులు
ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్
రాష్ట్రంలో సామాజిక, హక్కులు ఆర్థిక, భూమి సమస్యలు పరిష్కరించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) రాష్ట్ర అధ్యక్షులు ఓ.నల్లప్ప డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం నగర సమీపంలోని రుద్రంపేట బైపాస్‌లో కెవిపిఎస్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ సంతకాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపనున్నట్లు తెలిపారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో నేటికీ దళితులపై దాడులు, అత్యాచారాలు, మానభంగాలు కొనసాగుతున్నాయన్నారు. మణిపూర్‌లో మనువాదుల చేతుల్లో ఇద్దరు మహిళలను నగంగా ఊరేగించి అత్యాచారం చేసి సమాజానికి సిగ్గుచేటుగా నిలిచిందన్నారు. బిజెపి కేంద్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్డిన్ చట్టాన్ని రద్దు చేసిందన్నారు. రిజర్వేషన్లను అమలు చేయకుండా అనేక ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఇది. లౌకిక రాజ్యాంగానికే ప్రమాదం పొంచి ఉందన్నారు. మనువాద భావజాలాన్ని అమలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో కూడా దళితులపై దాడులు పెరుగుతున్నాయని తెలిపారు. దళితుల హక్కులను పాలక వర్గాలు కాలరాస్తున్నారని తెలిపారు. దళితులకు భూపంపిణీ చేయడానికి ప్రవేశపెట్టిన భూ చట్టాలను, 9/77 అసైన్డ్ చట్టాలను కాలరాసి దళితులకు భూమి లేకుండా చేస్తోందన్నారు. భూస్వాముల పక్షాన ప్రభుత్వం నిలబడుతోందన్నారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయకుండా దళితులకు ద్రోహం చేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో దళితుల హక్కులు-సామాజిక, ఆర్ధిక, భూమి సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా సామాజిక తరగతులు దళిత గిరిజన వ్యవసాయ కార్మికులు వివిధ సంస్థల ఆధ్వర్యంలో ఈనెల 4న ఢిల్లీలో ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రపతి రాష్ట్రంలో దళితుల స్థితిగతులపై వినతిపత్రం అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు జి.వెంకటేష్, జిల్లా నాయకులు జీవరత్నం, ఎర్రి స్వామి, అక్కులప్ప, వన్నూరప్ప, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.