ప్రజాశక్తి – బలిజిపేట : భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కరించి, తమ సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని, సంక్షేమ పథకాలు అందించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) జిల్లా కార్యదర్శి రాయపల్లి రాము డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో భవన నిర్మాణం కార్మిక సంఘం మండల కార్యదర్శి పైల సత్యనారాయణ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట భవన నిర్మాణ కార్మికుల బతుకులు నాశనం చేసే ఇసుక విధానం తీసుకొచ్చారని విమర్శించారు. కరోనా సమయంలో భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు అనేక అర్ధాకలితో ఇబ్బందులు పడినా కనీసం జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా రాజశేఖర్‌రెడ్డి భవనిర్మాణ కార్మికుల కోసం సంక్షేమ బోర్డును ప్రవేశపెడితే జగన్మోహన్ రెడ్డి ఆబోర్డును రద్దు చేయడం అత్యంత దారుణమని అన్నారు. సంక్షేమ బోర్డు రద్దు వల్ల భవన నిర్మాణ కార్మికులు అనేక సంక్షేమ పథకాలు కోల్పో వచ్చిన పరిస్థితి వచ్చింది. నాలుగున్నరేళ్లయినా ఇప్పటికీ భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆలోచించడం లేదన్నారు. ఇప్పటికైనా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు పునరుద్ధరించి, పిల్లలకు స్కాలర్షిప్ గుర్తింపు కార్డులు పెండింగ్ క్లైములు ఇన్సూరెన్స్ ఇఎస్ఐ వంటి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు బండి కోటి, చింతాడ కైలాసం, శ్రీను, మురళి, కార్మికులు పాల్గొన్నారు.