5లోగా అంగన్వాడీ సరుకులు పంపిణీ చేయాలి

Dec 1,2023 20:53

 ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌  :  ఎప్పటిలాగానే అంగన్‌వాడీ సరుకులు ప్రతి నెలా ఐదో తేదీలోగా పంపిణీ చేసేలా అనుమతి మంజూరు చేయాలని అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి గంట జ్యోతికుమారి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం సంఘం నాయకులు ప్రాజెక్టు డైరెక్టర్‌ నూర్జహాన్‌రాణిని కలిసి వినతి అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతినెలా 1 నుండి 5 వరకు, 16 నుండి 22 వరకు బాలింతలకు, గర్భిణులకు, చిన్నారులకు సరుకులు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. అయితే సమస్యల పరిష్కారం నిమిత్తం అంగన్‌వాడీ రాష్ట్ర నాయకత్వం ప్రకటించిన కార్యాచరణ మేరకు ఈనెల 8నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొనన్నందున, సమ్మెను విచ్ఛన్నం చేయాలని ఉద్దేశంతో సదరు తేదీలను ఈనెల 8 నుంచి 22వరకు మార్చడం అన్యాయమని అన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చి ఉన్నందున ఈనెల సరుకులను మాన్యువల్‌ పద్ధతిలో అందించేందుకు అధికారులు అనుమతించాలని డిమాండ్‌ చేశారు. వినతిని అందజేసిన వారిలో సెక్టార్‌ లీడర్లు రాజేశ్వరి, గౌరీమణి, అలివేణి, జ్యోతి పాల్గొన్నారు.పాలకొండ : ఈనెల 8నుంచి తలపెట్టిన నిరవధిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ మండలంలోని బుక్కూరు 1,2 అంగన్‌వాడీ కేంద్రాల్లో అంగన్‌వాడీ సిబ్బంది నల్ల రిబ్బన్లతో విధులకు హాజరై నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు ఎన్‌.హిమప్రభ, టి.దివ్య, గంగమ్మ తదితరులు పాల్గొన్నారు.సీతానగరం : మండలంలోని పెదబోగిలి పంచాయతీ అప్పయ్యపేట, సీతానగరం, బుడ్డిపేట గ్రామాలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలు ఇఒ జి వెంకటరావుకు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు సునీత, శైలజ మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 8 నుంచి తలపెట్టిన నిరవధిక సమ్మె నోటీసు అందజేశామన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు లక్ష్మి, మేరీ, రమాదేవి, సుజాత, తదితరులు పాల్గొన్నారు.

➡️