ప్రజాశక్తి పార్వతీపురం రూరల్ : ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించడం ద్వారా హెచ్ఐవి – ఎయిడ్స్ నియంత్రణ సాధ్యమవుతుందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి బి.జగన్నాథరావు అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ కార్యాలయం నుండి శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్‌జిఒ హోంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ హెచ్ఐవి, ఎయిడ్స్ పట్ల అవగాహన కల్పించడం కోసం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. హెచ్ఐవి, ఎయిడ్స్ పట్ల గ్లోబల్ హెల్త్ సెక్టారు స్ట్రాటజీ ద్వారా ముఖ్య సవాళ్లను అధిగమించడానికి గల అవకాశాల పట్ల అవగాహన కల్పిస్తామన్నారు. ”సమాజమే నడిపించాలి” శీర్షికన 2023 ప్రపంచ ఎయిడ్స్ దినం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయనగరం ఉమ్మడి జిల్లాలో సమగ్ర సలహా, పరీక్ష కేంద్రాలు ఐసిటి కేంద్రాలు, ప్రాథమిక, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఫెసిలిటీ ఇంటిగ్రేటెడ్ ఐసిటిసిలు తదితర హెచ్ఐవి, ఎయిడ్స్ పరీక్ష, సేవ, చికిత్సా సదుపాయాలు ఉన్నాయన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో హెచ్ఐవి పరీక్షలు నిర్వహించడం, ఈ వ్యాధిగ్రస్తులకు ఎఆర్టి కేంద్రాల్లో ఉచితంగా మందులు పంపిణీ జరుగుతోందని వివరించారు. జిల్లాలో గల హెచ్ఐవి, ఎయిడ్స్ బాధితులకు, లక్షిత గ్రూపులకు హెపటైటిస్ పరీక్షలు నిర్వహించి, హెపటైటిస్ వ్యాక్సిన్ వేయడం జరుగుతోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 391 మందికి పింఛను అందుతుందన్నారు. విద్యాశాఖ ద్వారా ఎన్ఎస్ఎస్, సహకారంతో కళాశాలలో రెడ్ రిబ్బన్ క్లబ్ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ యువతకు హెచ్ఐవి, ఎయిడ్స్‌పై సంపూర్ణ అవగాహన పెంచడంతో పాటు స్వచ్చంద రక్తదానాన్ని ప్రోత్సహించడం జరుగుతోందని ఆయన అన్నారు. జిల్లాలో ఆరుగురు గర్భిణులకు హెచ్ఐవి ఉన్నట్లు గుర్తించామని, 76 సాధారణ కేసులున్నాయని ఆయన తెలిపారు. అవగానతో హెచ్ఐవి, ఎయిడ్స్‌ను పూర్తిగా నియంత్రించాల్సిన అవసరం ఉందని, యువత ఇందులో ప్రధాన పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లాను ఎయిడ్స్ రహిత జిల్లాగా చేయాలని ఆయన అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా జిల్లాలో గల కళాశాల విద్యార్థులకు, యువతకు హెచ్ఐవి/ఎయిడ్స్‌పై జిల్లా స్థాయిలో క్విజ్, మారధాన్, చిత్ర లేఖన పోటీలు నిర్వహించారు. ఇందులో విజేతలకు, మంచి సేవలు అందించిన వైద్యులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, కార్యకర్తలకు ప్రశంసా పత్రం, జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ బి.వాగ్దేవి, ఆర్బిఎస్కె ప్రాజెక్టు అధికారి డాక్టర్ ధవళ భాస్కరరావు, డిపిఆర్‌ఒ లోచర్ల రమేష్, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ ఎం.వినోద్, జిల్లా ఇమ్మ్యునైజేషన్ అధికారి టి.జగన్మోహనరావు, ఐఎంఎ జిల్లా అధ్యక్షులు డాక్టర్ యాళ్ల వివేక్, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ యూనిట్ జిల్లా పర్యవేక్షకులు ఎన్.సాక్షి గోపాలరావు, నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు జివి ఆర్ ఎస్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.