మందకొడిగా రబీ

Dec 1,2023 20:50

 ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  :  జిల్లాలో రబీ పంటల సాగు మందకొడిగా సాగుతోంది. వర్షాభావ పరిస్థితులే ఇందుకు కారణంగా కనిపిస్తున్నాయి. ఇదేపరిస్థితి కొనసాగితే వ్యవసాయ ఉత్పత్తులతోపాటు రైతుల ఆదాయం తగ్గిపోనుంది. ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తున్నామంటున్న చిరుధాన్యాల సాగు కూడా అంతమాత్రంగానే ఉండడం గమనార్హం. వాస్తవానికి రబీ సీజన్‌ అక్టోబర్‌ నుంచే ప్రారంభమౌతుంది. అంతకు ముందు ఖరీఫ్‌ సీజన్‌లో కురిసిన హెచ్చుతగ్గు వర్షాల వల్ల వరి విస్తీర్ణం తగ్గింది. నాటిన వరి కూడా చాలా వరకు ఎండిపోయింది. ఈనేపథ్యంలో వరిలో అంతరపంటగా వేయాల్సిన పెసలు, మినుములు తదితరాలు నాటడం సాధ్యం కాలేదు. రబీ సీజన్‌ ఇప్పటికే రెండు నెలలు గడిచింది. డిసెంబర్‌తో ముగియనుంది. ఇప్పటికీ పంటల సాగు నత్తనడకనే సాగుతోంది. జిల్లాలో సుమారు పాతిక రకాల పంటల సాగు సాధారణ విస్తీర్ణం 1,72,710 ఎకరాలుగా అధికారులు గుర్తించారు. ఇందులో వరి, మొక్కజొన్న, రాగులు, పెసలు, మినుములు, చెరకు, నువ్వులు, వేరుశెనగ, కూరగాయలు, పలు రకాల పండ్లు సాగుకావాల్సి వుంది. గత ఏడాది సుమారు 1.60లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఇప్పటి వరకు 6,390 ఎకరాల్లో మాత్రమే సాగు కనిపిస్తోంది. ఖరీఫ్‌ సీజన్‌లో 2.21లక్షల ఎకరాలకు సాగునీటి వసతి ఉన్నట్టు అధికారిక లెక్కలు ఉన్నాయి. రబీలో సీజన్‌ నాటికీ ఈలెక్క గణనీయంగా తగ్గిపోతోంది. రబీ వరి సాధారణ సాగు 7,290 మాత్రమే కావడం ఇందుకు తార్కాణం. గత ఏడాది 2,155 ఎకరాల్లో నాట్లు పడ్డాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు నాట్లు పడలేదు. రబీలో అత్యధికంగా సాగవుతున్నది జొన్నలు, సాధారణ సాగు విస్తీర్ణం 53,495 ఎకరాలు కాగా, గత ఏడాది లక్ష్యానికి మించి 61,200 ఎకరాల్లో సాగయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 3,452 ఎకరాల్లో మాత్రమే సాగు కనిపిస్తోంది. మొక్కజొన్న 3,875 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేయగా ఇప్పటి వరకు ఒక్క ఎకరాలో కూడా నాటలేదు. నువ్వుల సాగు కూడా ప్రారంభం కాలేదు. మినుములు 2శాతం, పెసలు 3.30శాతం మాత్రమే సాగయ్యాయి. మిగిలిన పంటల సాగు మరీ ఆధ్వానంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులే ఇందుకు కారణమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్‌లో 87.3 మిల్లీమీటర్ల వర్షపులోటు నమోదు కాగా, నవంబర్‌లో ఇప్పటి వరకు 82.4 మి.మీ వర్షపాతం లోటు కనిపిస్తోంది. దీంతో రబీలోనూ రైతులకు నిరాశే ఎదురౌతోందని స్పష్టమౌతోంది.

➡️