ప్రజా సమస్యలు పరిష్కారంలో ప్రభుత్వ విఫలం
ప్రజాశక్తి-బాపట్ల : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్నకు చెబుదాం వృధా కార్యక్రమమని రాష్ట్ర సిపిఎం పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు డి.రమాదేవి అన్నారు. శుక్రవారం బాపట్ల జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు టి.కృష్ణమోహన్ అధ్యక్షతన జరిగిన సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. జగనన్నకు శబ్దం కార్యక్రమంలో ప్రజలు పెట్టుకున్న అర్జీలు
ఆన్ లైన్లో నమోదు చేసి ప్రజల సమస్య పరిష్కారం కాకుండానే సమస్య పరిష్కారం అయినట్టు మెసేజ్ లు రావడం దారుణమన్నారు. అన్యాక్రాంతమైన పేదల భూముల సమస్యలు, పెన్షన్లపై దృష్టి పెట్టలేదు. ప్రజలు వ్యయ ప్రయాసలకు గురికావడం, అధికారుల సమయం వృధా తప్ప సమస్యలు పరిష్కారమైన దాఖలాలు లేవన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వృత్తిదారులు, మహిళల పెన్షన్ కుదించిన వాటిని వెంటనే పునరుద్ధరణ చేయాలని అన్నారు. బాపట్ల జిల్లాలో అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల్లో నీరు లేక మండలంలో పంటలు ఎండిపోయాయి. ఆయా మండలాలను కరువు మండలాలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కు రావలసిన నీటి వాటా పై ముఖ్యమంత్రి చొరవ చూపి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద రెండు రాష్ట్రాల పోలీసులు మధ్య జరుగుతున్న ఘర్షణ వాతావరణం తగ్గించాలని కోరారు. రాష్ట్రంలో కరెంట్ స్మార్ట్ మీటర్ల ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆపివేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాన్ని వ్యతిరేకించాలన్నారు. వైసిపి, టిడిపి పార్టీలు బిజెపిని వ్యతిరేకించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సిహెచ్.గంగయ్య, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మణిలాల్, వినోద్, బాబురావు, సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ మజుందార్ పాల్గొన్నారు.