ప్రజాశక్తి-పాలకొండ : అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం మోసం చేసిందని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకులు ఎన్.హిమప్రభ ఆగ్రహం వ్యక్తంచేశారు. అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 8 నుంచి చేపట్టే సమ్మెకు మద్దతుగా బుధవారం పాలకొండలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటుచేశారు. అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు బి.అమరవేణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు చెల్లిస్తామని సిఎం జగన్ హామీ ఇచ్చి విస్మరించారని విమర్శించారు. అంగన్వాడీలకు గ్రాడ్యుటి ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా అమలు చేయలేదని చెప్పారు. కేంద్రాల నిర్వహణకు అంగన్వాడీల జీతం నుంచి పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రీ స్కూల్ పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు నాణ్యమైన సరుకులు అందివ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై అనేక ఆందోళనలు చేపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పైగా నిర్బంధాలు ప్రయోగిస్తూ పోరాటాలని అణిచివేసే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 8 నుండి రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ సెంటర్లు మూసివేసి నిరవధిక సమ్మె చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు అంగన్వాడీలకు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. పలు ప్రజా సంఘాల నాయకులు ఎం.కాంతారావు, కాద రాము, దూసి దుర్గారావు, ఎడ్ల శ్రీనివాసరావు, కె.శారద, ఎం.శ్రీదేవి, ఎం.శ్యామల, మజ్జి వీరంనాయుడు, సిహెచ్ వెంకటరత్నం, ఆర్.ఈశ్వరరావు, ఎన్.సోమేశ్వరరావు కె.శ్యామలరావు మాట్లాడుతూ అంగన్వాడీల సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కొమరాడ : అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 8వ తేదీన జరిగే సమ్మెను జయప్రదం చేయాలని అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్టు ఉపాధ్యక్షులు చిరిగి అనురాధ కోరారు. సమ్మెను విజయవంతం చేయాలని కొమరాడ ప్రాజెక్టు వద్ద బుధవారం ప్రచారం చేశారు. కార్యక్రమంలో జయమ్మ, అలివేలు, రాజేశ్వరమ్మ, పద్మ పాల్గొన్నారు.