పాఠశాలల్లో నాడు-నేడు పనులు పూర్తి చేయాలి

అధికారులకు వినతిపత్రం సమర్పిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

ప్రజాశక్తి-ఉరవకొండ

ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి సిద్ధార్థ డిమాండ్‌ చేశారు. ఈమేరకు బుధవారం పట్టణంలోని తహశీల్దార్‌ కార్యాలయంలో తహశీల్దార్‌ శ్రీధర్‌మూర్తి, మండల అడ్మినిస్ట్రేషన్‌ అధికారి జయరాములును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని పాఠశాల్లో నాడు-నేడు పనులు పూర్తిగా ఆగిపోయిన దుస్థితి నెలకొందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలను తెరవకముందే నాడు-నేడు పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చి పాఠశాలలు తెరిచి ఐదు నెలలు పూర్తి కావస్తున్నా ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయన్నారు. ముఖ్యంగా ఉరవకొండ మండల కేంద్రంలోని పాతపేట ఎంపీపీ స్కూల్లో నాడు-నేడు పనులు పూర్తి కాకపోవడం వల్ల విద్యార్థులకు తరగతి గదులు లేక ఆరుబయటే చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రధానంగా నాడు-నేడు పనులు పూర్తి కాకపోవడానికి గుత్తేదారులు చెబుతున్న కారణం ప్రభుత్వం నుంచి బిల్లులు రావడం లేదని చెబుతున్నారన్నారు. కావున ప్రభుత్వం తక్షణమే పెండింగ్‌ బిల్లులు చెల్లించి పనులను పూర్తి చేసి ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో విద్యార్థులు, తల్లిదండ్రులను కలుపుకుని ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్ష కార్యదర్శులు హిరణ్య, నందు, మహేష్‌, రాజేష్‌, వంశీ, అశోక్‌, బన్నీ, తదితరులు పాల్గొన్నారు.

➡️