బ్లాస్టింగులు చేసేటప్పుడు నిబంధనలు పాటించాలి

గనుల యజమానులతో మాట్లాడుతున్న డీఎస్పీ గంగయ్య

ప్రజాశక్తి-తాడిపత్రి

గనుల్లో పేలుడు పదార్థాల ద్వారా బ్లాస్టింగులు చేసేటప్పుడు తప్పకుండా నిబంధనలు పాటించాలని డీఎస్పీ సిఎం గంగయ్య సూచించారు. ఎస్పీ కెకెఎన్‌ అన్బురాజన్‌ ఆదేశాల మేరకు తాడిపత్రి సబ్‌-డివిజన్‌ పరిధిలోని మైన్స్‌ యజమానులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గనుల్లో పేలుడు పదార్థాలు ఉపయోగించి బ్లాస్టింగ్‌ చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బ్లాస్ట్‌ చేసేందుకు సంబంధిత మైన్స్‌, జియాలజీ విభాగాల అనుమతి తీసుకోవాలన్నారు. ఒకవేళ థర్డ్‌ పార్టీలతో బ్లాస్టింగ్‌ చేయించుకునేటప్పుడు సదరు ఏజెన్సీ వారితో తప్పక అగ్రిమెంట్‌ చేయించుకోవాలన్నారు. బ్లాస్టింగ్‌కు అనుమతి పొందిన వారితోగానీ, వారి పర్యవేక్షణలోగానీ బ్లాస్టింగ్‌ చేసుకోవాలన్నారు. బ్లాస్టింగ్‌ చేసే సమయంలో చుట్టుపక్కల 500 మీటర్ల వరకూ ప్రజలు ఎవ్వరూ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పేలుడు పదార్థాలైన స్లర్రీ, నైట్రోజన్‌, డిటోనేటర్స్‌, సేఫ్టీఫ్యూజ్‌లను లైసెన్సు పొందిన వారి నుంచే కొనుగోలు చేయాలన్నారు. బ్లాస్టింగ్‌ ఎంత అవసరమో అంత మోతాదులో మాత్రమే పేలుడు పదార్థాలను కొనుగోలు చేయాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో యాడికి సిఐ శంకర్‌ రెడ్డి, అసిస్టెంట్‌ జియలాజిస్ట్‌ ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.

➡️