పాలస్తీనాలో పసిపిల్లలను కాపాడాలి

దీపాలు వెలిగించి నివాళులర్పిస్తున్న ఐద్వా, డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌

ఇజ్రాయిల్‌ మారణ హోమంలో బలవుతున్న పాలస్తినాలో అమాయక పిల్లలను కాపాడాలని ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి అన్నారు. బుధవారం పాలస్తీనాలో పసిపిల్లల ప్రాణాలు కాపాడాలని డిమాండ్‌ చేస్తూ ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, ఆవాజ్‌ ఆధ్వర్యంలో టవర్‌క్లాక్‌ వద్ద విద్యార్థినులతో దీపాలు వెలిగించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇజ్రాయిల్‌ పాలస్తీనాపై చేస్తున్న యుద్ధంలో వేలాది పసి ప్రాణాలు హరించకపోతున్నాయని తెలిపారు. 1946 నవంబర్‌ 29న పాలస్తీనాకు ఐక్య రాజ్యసమితి మొట్ట మొదటి సారి సంఘీభావాన్ని తెలిపిందన్నారు 77 సంవత్సరాల తర్వాత తిరిగి పాలస్తీనాకు ప్రపంచ ప్రజలందరూ సంఘీభావం తెలపాల్సిన పరిస్థితి ఏర్పడడం సామ్రాజ్యవాదం కుట్ర ఫలితమేనని తెలిపారు. అమెరికా అండతో పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించుకుంటూ ఉగ్రవాద భూతాన్ని చూపి ఆ దేశాన్ని ఆ దేశంలోని ప్రజలను అంతం చేయడానికి ఇజ్రాయిల్‌ ప్రయత్నిస్తోందన్నారు. జాతీయ ఉద్యమం నుంచి పాలస్తినాకు అండగా ఉన్న భారతదేశం నేడు మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇజ్రాయిల్‌కు మద్దతు ఇవ్వడం దారుణమని విమర్శించారు. పాలస్తీనా పై ఇజ్రాయిల్‌ చేస్తున్న దాడిలో ఇప్పటికే 12,800 మంది ప్రజలు మరణించారని, అందులో 5400 మంది పసిపిల్లలు ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి ప్రకటించిందన్నారు. తక్షణం పాలస్థినపై దాడులు ఆపాలని ప్రపంచ దేశాలు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ఇజ్రాయిల్‌ ఖాతరు చేయకుండా అమెరికా అండతో చెలరేగుతోందన్నారు. శాంతికాముకులంతా పాలస్తీనాకు అండగా నిలబడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా అధ్యక్ష కార్యదర్శులు శ్యామలమ్మ, రాజేశ్వరి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పరమేష,్‌ డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి, అధ్యక్షులు బాలక్రిష్ణ, ఆవాజ్‌ జిల్లా అద్యక్ష కార్యదర్శులు వలి, ముస్కిన్‌, ప్రజా సంఘాల నాయకులు ప్రకాష్‌, రామిరెడ్డి, మహదేవ్‌ నగర్‌ బాబు, ముత్తుజా, సురేష్‌, ఫరీదా, ఫక్రు, గిరి, శివ, ఇస్మాయిల్‌, రాజు, ఇర్ఫాన్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️