ప్రజాశక్తి -గుమ్మలక్ష్మీపురం : స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వినియోగదారుల హక్కులు, చట్టాలపై అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల సమాచార కేంద్ర నిర్వాహకులు (డిసిఐసి) పట్నాయకుని నాగమణి వినియోగదారుల హక్కుల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణలో తమ పాత్ర గురించి విద్యార్థులకు పరిజ్ఞానం కలిగించి తద్వారా వారి తల్లిదండ్రులను చైతన్యవంతులను చేసేలా అవగాహన సదస్సులు ఎంతగానో దోహదపడతా యన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, సౌకర్యాలు, సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులను ఏ విధంగా సంప్రదించాలనే అంశాలను వివరించారు. ఏ సమస్యను ఎవరికి ఫిర్యాదు చేయాలి, పరిష్కార మార్గాలు ఏమిటనే విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు కల్తీలను కనిపెట్టడం, విద్యా, ఆరోగ్య పరిరక్షణ వంటి కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం వల్ల వారిలో బాధ్యతాయుతమైన ప్రవృత్తి పెరుగుతుందన్నారు. వినియోగదారులు న్యాయం చేయాలని, రాతపూర్వకంగా, అంతర్జాలం ద్వారా ఫిర్యాదు చేయవచ్చనని తెలిపారు. 1967/18004250082 ఫోన్ చేసి ముఖ్యమైన సమాచారం పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బిడ్డిక భీముడు, పాఠశాల వినియోగదారుల క్లబ్ నిర్వాహకులు ప్రమీల, మురళి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.