జనావాసాల మధ్య సెల్‌ టవర్‌ నిర్మాణం ఆపాలి

సెల్‌ టవర్‌ నిర్మాణంపై కలెక్టర్‌కు వివరిస్తున్న ఐద్వా నాయకురాళ్లు

 

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌

జనావాసాల మధ్య సెల్‌ టవర్‌ నిర్మాణం నిలిపివేయాలని ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి, జిల్లా ఉపాధ్యక్షురాలు రామాంజనమ్మ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్‌.వి.నాయుడు డిమాండ్‌ చేశారు. విద్యారణ్య కాలనీవాసులో జనావాసాల మధ్య ఏర్పాటు చేస్తున్న సెల్‌టవర్‌ నిర్మాణం తక్షణమే ఆపాలని సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌ ఎం.గౌతమికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎ.నారాయణపురం పంచాయతీ సచివాలయం 5 పరిధిలోని విద్యారణ్యనగర్‌లో ఎల్‌.11/ బి.6 విద్యుత్‌ స్తంభం పక్కన టి కేశవరెడ్డికి చెందిన భవనంపై ప్రయివేట్‌ కంపెనీ సెల్‌టవర్‌ నిర్మాణం జరుగుతోందన్నారు. ఈ ప్రాంతంలో అత్యధిక జనాభా వడ్డెర, దినసరి బెల్దారి, ఆటో తదితర రంగాలపై ఆధారపడి జీవిస్తున్న వారు అన్నారు. సెల్‌ టవర్‌ ఏర్పాటుపై భవనం యజమాని, పంచాయతీ సచివాల అధికారులు, కాలనీవాసులు ఎవరితోనూ ప్రయివేట్‌ కంపెనీ చర్చించకుండా ఏకపక్షంగా సెల్‌టవర్‌ నిర్మాణం చేయడం సరి కాదన్నారు. కాలనీవాసులు అనేకమార్లు అధికారులకు విన్నవిస్తున్నప్పటికీ యాజమాన్యం బలవంతంగా సెల్‌ టవర్‌ నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు. సెల్‌ టవర్‌ ఏర్పాటు జరిగితే రేడియేషన్‌ వ్యాప్తి వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతా అన్న భయాందోళనలో ప్రజలు ఉన్నారని, కాలనీవాసులంతా పేద మధ్యతరగతి కుటుంబాలే జీవిస్తున్నాయని తెలిపారు. సెల్‌ టవర్‌ నిర్మాణం వల్ల భువన యజమానికి అదే రూపంలో వచ్చే నగదు తప్ప, కాలనీ ప్రజలకు ఒరిగిందేమీ లేదని, తక్షణమే సెల్‌ టవర్‌ నిర్మాణం నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన కలెక్టర్‌ ఎం.గౌతమి తక్షణమే సెల్‌ టవర్‌ నిర్మాణాన్ని ఆపాలని అనంతపురం తహశీల్దార్‌ ఫోన్‌ ద్వారా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు యశోదమ్మ, పద్మ, పర్వీన్‌, కళావతి, లక్ష్మీదేవి, యశోదమ్మ, వరలక్ష్మి, గంగాదేవి తదితరులు పాల్గొన్నారు.

➡️