మట్టిని మింగేస్తున్నారు..!

పారిశ్రామిక వాడలో జెసిబితో మట్టిని తవ్వి, తరలిస్తున్న దృశ్యం

      హిందూపురం : హిందూపురం పట్టణం, రూరల్‌ మండలం వ్యాప్తంగా మట్టి మాఫియా రెచ్చిపోతోంది. చెరువుల్లోనే కాదు ఖాళీ స్థలాలను సైతం వదలకుండా యథేచ్ఛగా మట్టిని మింగేస్తున్నారు. ఏకంగా ప్రొక్లెయిన్‌లను పెట్టి ఎక్కడబడితే అక్కడ గోతులు తవ్వి మట్టిని తరలించేస్తున్నారు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులకు సమచారం ఇచ్చినప్పటికీ వారిలో కనీస స్పందన లేదు. హిందూపురం రూరల్‌ మండలం తూముకుంట పారిశ్రామికవాడ ఇటీవల మట్టి తరలింపు రోజురోజుకు అధికం అవుతోంది. తూముకుంట పారిశ్రామికవాడ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో కొందరు పట్ట పగలే దర్జాగా ప్రొక్లెయిన్‌లను పెట్టి మూడు టిప్పర్‌లతో పక్కన ఉన్న కర్నాటక పారిశ్రామిక వాడలోకి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇదంతా అందరూ చూస్తుండగానే జరుగుతున్నా దీని గురించి సంబంధిత అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. గతంలో మట్టి మాఫియా చెరువుల్లో ఏలాంటి అనుమతులు లేకుండా మట్టిని తవ్వి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వేస్తున్న వెంచర్లకు తరలించారు. గత సంవత్సరం కురిసిన వర్షాలకు కాస్తోకూస్తో చెరువుల్లోకి నీళ్లు వచ్చాయి. దీంతో చెరువుల్లో మట్టిని తవ్వడానికి సాధ్యం కాక పోవడంతో మట్టి మాఫియా ఖాళీ స్థలాలను ఎంపిక చేసుకుని, ఆ స్థలాల్లో ఏకంగా ప్రొక్లెయిన్‌లను పెట్టి తవ్వుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మట్టి కావాల్సిన వారు అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. వ్యవసాయం చేసే రైతులకు ఉచితంగా అనుమతిస్తారు. ఇతర వాణిజ్య, నిర్మాణ రంగం, అభివద్ధి పనుల అవసరాలకు తరలించాలంటే నిర్ణీత రుసుం ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. ఈ నిబంధన హిందూపురం పరిసర ప్రాంతాల్లో ఎక్కడా అమలు కావడం లేదు. ఒకవేళ ఎవరైనా అనుమతులు పొందినా రెట్టింపు తవ్వకాలు చేస్తున్నారు. రాజకీయ నాయకుల అండదండలతో మట్టితరలింపుదారులు నిబంధనలను యథేచ్ఛగా అతిక్రమిస్తున్నారు. మట్టి మాఫిపై నిఘా ఉంచి నియంత్రించాల్సిన రెవెన్యూ, జలవనరులు, భూగర్భ గనులు, విజిలెన్సు, పోలీసు శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కన్పిస్తోంది. మట్టితరలింపుపై గ్రామస్తులు ఎవరైనా సమాచారం అందించినా అధికారులు ఆ ప్రాంతానికి సకాలంలో వెళ్లడం లేదు. తూముకుంట పారిశ్రామికవాడలో స్థానికులు మట్టితరలింపుపై అధికారులకు సమాచారం ఇచ్చినా వారి నుంచి స్పందన కరువు అవుతోంది. ఖాళీ స్థలాల్లో మట్టి కోసం పెద్దపెద్ద గుంతలు పెట్టడంతో అక్కడ చిన్నపాటి వర్షాలకే గుంతల్లోకి నీరు చేరుతోంది. కొత్తవాళ్లు ఎవరైనా ఇక్కడికొస్తే ఈ నీటిలో పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితిని నియంత్రించేందుకు ఇప్పటికైన సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

➡️