ప్రజాశక్తి-రాజవొమ్మంగి : రాజవొమ్మంగిలోని అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1966 నుండి 2023 వరకు చదివిన విద్యార్థుల సమ్మెళనం డిసెంబర్ 16,17 తేదీలలో జరుగుతున్న నేపథ్యంలో పాఠశాల పూర్వపు విద్యార్థి ముదునూరి సూర్యనారాయణ పాఠశాల ఆవరణలో అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజు సంచరించిన పోరాట గడ్డ రాజవొమ్మంగిలో అల్లూరి నిలువెత్తు విగ్రహం ఉండాలనే సదుద్దేశంతో సొంత డబ్బు సుమారు 7 లక్షలను సమకూర్చి విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పూర్వ విద్యార్థి దంతులూరి శివరామచంద్రరాజు తదితరులు మాట్లాడుతూ.. ముదునూరి సూర్యనారాయణ అల్లూరి విగ్రహం ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. స్వర్ణోత్సవాల పకడ్బందీ నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని 1966 నుండి 2023 వరకు ఇదే పాఠశాలలో విద్యను అభ్యసించిన పూర్వపు విద్యార్థులు అందరూ ఒకే చోట కలవడం జరుగుతుందని ఆయన తెలిపారు. స్వర్ణోత్సవాలను అందరూ విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు చీడిపల్లి అప్పారావు,కష్ణ వర్మ,డి శివాజీ,జీవన్, సూరిబాబు,టి వీర్రాజు, బాబు,వాణి తదితరులు పాల్గొన్నారు.