ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్ : విద్యార్థులు ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలని ప్రముఖ రచయిత గంటేడ గౌరునాయుడు సూచించారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం పార్వతీపురం ఎస్‌వి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రశ్నించినప్పుడే బతుకులు బాగుపడతాయని తెలిపారు. సామాన్యులకు, పేదలకు నేటికీ రాజ్యాంగ, స్వాతంత్య్ర ఫలాలు అందడం లేదని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సామాజిక మార్పుకోసం కృషి చేయాలని కోరారు. జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారి డాక్టర్ ఎంవిఆర్ కృష్ణాజీ మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ చలపతిరావు మాట్లాడుతూ రాజ్యాంగ రూపకల్పనకు సంబంధించిన విషయాలు వివరించారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు పి.రంజిత్ కుమార్ మాట్లాడుతూ రిజర్వేషన్లు ప్రమాదంలో పడ్డాయని, రక్షించుకునేందుకు విద్యార్థులు, యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా డాక్టర్ బ్రహ్మారెడ్డి రచించిన ‘భారత ప్రజలమైన మేము ఈ దేశానికి యజమానులం’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేదిక జిల్లా కార్యదర్శి డి.చంద్ర మౌళి అధ్యక్షతన జరిగిన సదస్సులో సభ్యులు డి.సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.స్వేచ్ఛను పెంపొందించుకోవాలిసీతంపేట : స్వేచ్ఛను పెంపొందించుకోవాలని ఎంపిపి బిడ్డిక ఆదినారాయణ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఎంపిడిఒ కార్యాలయంలో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎంపిటిసి సభ్యులతో భారత సంవిధాన ప్రస్తావనను చదివి వినిపించారు. సమావేశంలో ఎంపిడిఒ కె.గీతాంజలి, పిఆర్ జెఇ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.