రైతు బంధు కావాలా ? రాబందులు కావాలా ? : ఎమ్మెల్సీ కవిత

Nov 27,2023 11:32 #media meeting, #mlc kavita, #Telangana

నిజామాబాద్‌ (తెలంగాణ) : కాంగ్రెస్‌ నేతలు బిజెపిని ఎందుకు ప్రశ్నించడం లేదని బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిలదీశారు. సోమవారం నిజామాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ …. ఉపాధి హామీ నిధులకు కేంద్రం భారీగా కోతలు విధించిందన్నారు. ఉపాధి హామీ పథకంలో కూలీలకు సగటున రూ.150 కూడా రావడం లేదన్నారు. వేలమంది కూలీల పొట్టగొడుతున్న బిజెపి ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం కాంగ్రెస్‌ ఎందుకు చేయడం లేదు ? అని ప్రశ్నించింది. పెద్దపెద్ద కార్పొరేట్లకు మాత్రమే మోడి సాయం చేశారనీ.. కేంద్ర ప్రభుత్వం బడా వ్యాపారులకే రుణాలు మాఫీ చేసిందని విమర్శించారు. తెలంగాణలో బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక ఇచ్చినన్ని ఉద్యోగాలు ఏ రాష్ట్రంలోనూ ఇవ్వలేదని చెప్పారు. బిఆర్‌ఎస్‌ మళ్లీ గెలిస్తే కొత్త రేషన్‌కార్డులు ఇస్తామన్నారు. కులమతాల పేరుతో కొన్ని పార్టీలు ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నాయన్నారు. ఇరిగేషన్‌ కావాలా.. మైగ్రేషన్‌ కావాలా ? రైతుబంధు కావాలా ? రాబందులు కావాలా ? 24 గంటల విద్యుత్‌ కావాలా ? 3 గంటల కరెంట్‌ కావాలా ? అనేది ప్రజలు ఆలోచించుకోవాలని కవిత అన్నారు.

➡️