వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచే పోటీ- సిబిఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ వివి.లక్ష్మీనారాయణ

Nov 29,2023 20:48 #JD Lakshminarayan

– అవసరమైతే కొత్త రాజకీయ పార్టీ

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (విశాఖ) వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా విశాఖ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు సిబిఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ వివి.లక్ష్మీనారాయణ తెలిపారు. విశాఖలోని విజెఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో తాను విశాఖ నుంచి పోటీ చేయగా సుమారు మూడు లక్షల ఓట్లు వచ్చాయని తెలిపారు. విశాఖ ప్రజలు తనను ఎంతగానో ఆదరించారని చెప్పారు. వారి ఆదరణను చూసి మళ్లీ ఇక్కడి నుంచే పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలు తనను ఆహ్వానిస్తున్నాయని, వాటిని పరిశీలిస్తున్నానని చెప్పారు. తనకు పార్టీ నచ్చితే దాని తరుఫున పోటీ చేసేందుకు అభ్యంతరం ఉండదన్నారు. రాజకీయాలలో నిజాయితీగా ప్రజాసేవ చేసేందుకు వచ్చే వారికి ప్రజల ఆదరణ ఉంటుందని తెలిపారు. దీనికి రాజకీయాలతో పనిలేదన్నారు. అందుకే తాను కొత్తగా రాజకీయ పార్టీని స్థాపించాలని కూడా ఆలోచిస్తున్నానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కొల్లాపూర్‌ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్రంగా పోటీ చేస్తున్న బర్రెలక్కకు (శిరీష) ప్రజల నుంచి మద్దతు లభిస్తోందన్నారు. ఉన్నత విద్యనభ్యసించి ఉద్యోగం లభించక బర్రెల లక్కగా మారిన ఆమె, ప్రజాసేవ చేయాలని భావించి, ఎన్నికల బరిలోకి దిగిన విషయాన్ని గుర్తు చేశారు. ఓటర్ల జాబితాలో బోగస్‌ ఓట్లను కచ్చితంగా తొలగించాలన్నారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.2న మెగా జాబ్‌ మేళా పిఎం.పాలెం క్రికెట్‌ స్టేడియం వెనుక ఉన్న సాంకేతిక ఇంజనీరింగ్‌ కళాశాలలో జెడి.ఫౌండేషన్‌ ఆధ్వర్యాన డిసెంబర్‌ 2న జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు వివి.లకీëనారాయణ ప్రకటించారు. జాబ్‌ మేళాలో 50కిపైగా కంపెనీలు పాల్గంటాయని తెలిపారు. పదో తరగతి ఆపై విద్యార్హతలున్నవారు జాబ్‌ మేళాలో పాల్గనవచ్చని చెప్పారు. జాబ్‌మెళాలో ఉద్యోగం సాధించలేని వారికి ప్రత్యేకంగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ ఇచ్చి ఉపాధి వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జెడి ఫౌండేషన్‌ కన్వీనర్‌ ప్రియాంక దండి, కృష్ణమోహన్‌, నిశ్చల్‌, నాగరాజు, సాంకేతిక కాలేజీ ప్రతినిధి కృష్ణకుమార్‌ పాల్గొన్నారు.

 

➡️