ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడమే అంబేద్కర్‌కు ఇచ్చే ఘనమైన నివాళి అని దళిత్ శోషణ్ ముక్తి మంచ్(డిఎస్‌ఎంఎం) జాతీయ నాయకులు వి శ్రీనివాసరావు అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్మితమవుతున్న అంబేద్కర్ 125 అడుగుల విగ్రహా ఏర్పాట్లను ఆదివారం ఆయన పరిశీలించి నివాళలర్పించారు. జరుగుతున్న పనులను పరిశీలించి అక్కడి ఉన్న అధికారులతో చర్చించారు. స్వరాజ్య మైదానంలో 125 అడుగుల విగ్రహాం నిర్మాణం పట్ల ఆయన హార్షం వ్యక్తం చేశారు. అంబేద్కర్ చేతిలో ఉన్న రాజ్యాంగమే దేశానికి పునాదిగా ఉందన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని 125 అడుగుల పాతాళంలోకి తొక్కేస్తోందని విమర్శించారు. స్వాతంత్య్రం అనంతరం రాజ్యాంగాన్ని జాతికి అంకితం చేసిన రోజు నవంబర్ 26 అని చెప్పారు. దేశానికి పునాదిగా ఉన్న రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని చెప్పారు. దళితులు, ఆదివాసీలు వంటి అన్ని వర్గాల ప్రజల భవిష్యత్తు ఈ పరిరక్షణపైనే ఆధారపడి ఉంటుందన్నారు. వీలైనంత త్వరగా అంబేద్కర్ పార్క్‌ను రాష్ట్రప్రభుత్వం పూర్తిచేసి జాతికి అంకితం చేయాలని కోరారు. కెవిపిఎస్ ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ దేశంలో అంబేద్కర్‌కు ప్రాధాన్యత ఉందన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని కుల వ్యవస్థ భారతదేశంలో ఉందని, ఈ వ్యవస్థ పోవాలని అంబేద్కర్ కోరుకున్నారని చెప్పారు. అంబేద్కర్ జపం చేస్తున్న మనువాద మతోన్మాదులు కుల వ్యవస్థను ప్రోత్సాహిస్తున్నారని చెప్పారు. ఇప్పటికీ కులం పేరుతో దుర్మార్గాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్న చట్టాలు కాపాడటంలో పాలకులు విఫలమయ్యారని చెప్పారు. భారత రాజ్యాంగానికి ముప్పు వాటిల్లుతోందని, ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తాన్ని కార్పొరేట్ శక్తులకు అమ్ముతున్నారని తెలిపారు. రాజ్యాంగాన్ని, ప్రభుత్వం రంగ సంస్థలను కాపాడుకోవడంతో పాటు కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ ఉపాధ్యక్షులు దడాల సుబ్బారావు, సహాయక కార్యదర్శి జి క్రాంతికిరణ్, రాష్ట్ర నాయకులు సిహెచ్ శ్రీనివాస్, జి అరుణ, డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న, ప్రజానాట్యమండలి రాష్ట్రకార్యదర్శి ఎస్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.