మంచిర్యాల: ఐదేళ్ల భవిష్యత్తు బాగుండాలంటే ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని తెలంగాణ మంత్రి కేసీఆర్ అన్నారు. మంచిర్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి పాల్గన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల చేతుల్లో ఉన్న ఏకైక వజ్రాయుధం ఓటు అని తెలిపారు.”కాంగ్రెస్ హయాంలో ఆకలిచావులు, రైతుల ఆత్మహత్యలు ఉండేవి. గోదావరి ఒడ్డున ఉన్న ప్రాంతాలకూ కాంగ్రెస్ నీళ్లు ఇవ్వలేకపోయింది. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అన్నట్లు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాను. పింఛను రూ.2వేలకు పెంచాం. మళ్లీ బిఆర్‌ఎస్ ప్రభుత్వం రాగానే పింఛను రూ.5వేలకు పెంచుతాం. 3కోట్ల మందికి కంటి పరీక్షలు చేసి 80లక్షల మందికి కళ్లద్దాలు ఇచ్చాం. నీటిపన్నును రద్దు చేశాం.. రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ప్రజల కట్టే పన్నులు రైతుబంధు ఇచ్చి దుబారా చేస్తున్నాం అని కాంగ్రెస్ అంటోంది. రైతుబంధు దుబారానా? మళ్లీ బిఆర్‌ఎస్ ప్రభుత్వం రాగానే రైతుబంధు రూ.16వేలకు పెంచుతాం. రైతులకు 3గంటల కరెంట్ చాలు అని రేవంత్ రెడ్డి అంటున్నారు. రైతులకు 3గంటల కరెంట్ సరిపోతుందా? ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తాం అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ధరణి తీసేస్తే రైతుబంధు డబ్బులు ఎలా వస్తాయి? ధరణి వల్ల అర్ధగంటలోపు రిజిస్ట్రేషన్లు పూర్తి అవుతున్నాయి. తెలంగాణ సాధన కోసం పుట్టిన పార్టీ బిఆర్‌ఎస్” అని కేసీఆర్ స్పష్టం చేశారు.