-
కమ్యూనిస్టులకు ఓటేస్తే అది వజ్రాయుధమవుతుంది : రాఘవులు
ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : పోరాటాలు చేసే సిపిఎంకి ఓటు వేస్తే.. రేపు గల్లబట్టి నిలదీసి సమస్యలు పరిష్కరించుకోవచ్చని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు తెలిపారు. ప్రజల పక్షాన నిరంతరం పోరాటాలు చేస్తూ ప్రజలకు అండగా ఉంటున్న సిపిఎం అభ్యర్థి ఎం. దశరథ్‌కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హైదరాబాద్ ముషీరాబాద్‌లోని కవాడిగూడ డివిజన్ భీమా మైదానం బస్తీలో పాదయాత్ర నిర్వహించిన ఆ పార్టీ అభ్యర్థి దశరథ్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో ముషీరాబాద్ నియోజకవర్గంలో నాలుగు ప్రధాన పార్టీలు పోటీలో ఉన్నాయని, మీరంతా డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తారనే అలోచనతో వారంతా డబ్బులను నమ్ముకున్నారని, గెలిచిన తర్వాత ఖర్చు పెట్టిన డబ్బులు సంపాదించుకునే పనిలోనే ఉంటారు తప్పితే.. ప్రజల సమస్యలు పట్టించుకోరని తెలిపారు. అదే.. సిపిఎంకి వేసే ప్రతి ఓటు ఒక పోరాట ఆయుధమవుతుందని అన్నారు. మతం పేరుతో బిజెపి ఓట్లు సంపాదించే ప్రయత్నం చేస్తుందన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ బిఆర్‌ఎస్‌గా మారి ప్రజల పక్షాన ఉన్నామంటూ ప్రజలను మభ్యపెడుతూ మతోన్మాద పార్టీకి మద్దతు తెలియజేస్తుందని తెలిపారు. కేంద్రంలో మోడీ అయినా రాష్ట్రంలో కెసిఆర్ అయినా ప్రజల సమస్యలు పక్కనపెట్టి వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడంలో ముందుంటారన్నారు. భీమ మైదానంలో ఇండ్లు కూలిపోతున్నా ఇక్కడ గెలిచిన ముఠాగోపాల్ ఇప్పటివరకు పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. రోడ్ల సమస్య, కుట్టు మిషన్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సమస్యలతోపాటు రేషన్ కార్డుల సమస్యలపై సిపిఎం నాయకత్వంలో నిరంతరం పోరాటం చేసి సాధించుకున్నామని గుర్తు చేశారు. సిపిఎం అభ్యర్థి ఎం.దశరథ్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి నర్సింహరావు, రాష్ట్ర నాయకులు అరుణ జ్యోతి, పార్టీ నగర కార్యదర్శి ఎం. శ్రీనివాస్, నగర కార్యదర్శివర్గ సభ్యులు ఎం. వెంకటేష్, నాగలక్మి తదితరులు పాల్గొన్నారు.