డిసెంబరు 30న ధర్నా
పోస్టరు ఆవిష్కరించిన యుటిఎఫ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిసెంబరు 30న విజయవాడలో రాష్ట్రస్థాయి ధర్నాను యుటిఎఫ్ నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన పోస్టరును పిడిఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావుతో కలిసి ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్ వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్ ప్రసాద్ బుధవారం విజయవాడలోని యుటిఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో విడుదల చేశారు. మున్సిపల్ ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు నిర్వహించాలని, ఉన్నత పాఠశాలల్లోని అన్ని పోస్టులనూ అప్‌గ్రేడ్ చేయాలని, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరుతూ ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. 2022 జూన్‌లో మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీసులు, మున్సిపల్ యాజమాన్యం నుంచి పాఠశాల విద్యాశాఖ పర్యవేక్షణలోకి వచ్చాయని పేర్కొన్నారు. తమ ఫెడరేషన్ చేసిన ప్రత్యేక కృషి వల్ల సేవా పుస్తకాలు, కేడర్ స్ట్రెంత్ సమస్యలు పరిష్కారమయ్యాయని తెలిపారు. మౌలిక సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని చెప్పారు. ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల మాదిరి మున్సిపల్ టీచర్ల పోస్టులనూ సబ్జెక్టు టీచర్లుగా అప్‌గ్రేడ్ చేసి ప్రమోషన్లు కల్పించాల్సి ఉందని తెలిపారు. అయినా ఉన్నత పాఠశాలల్లో ఎస్‌జిటిలుగా కొనసాగుతున్నారని అన్నారు. పాఠశాలల్లో పెరుగుతున్న పిల్లల సంఖ్యకు అనుగుణంగా సబ్జెక్టు టీచర్ల కొరతను తగ్గించేందుకు వెంటనే అప్‌గ్రేడ్ చేయాలని డిమాండ్ చేశారు. బదిలీలు, ప్రమోషన్లు, అప్‌గ్రేడేషన్ అమలు చేస్తామని విద్యాశాఖ మంత్రి ఇచ్చిన హామీ నెరవేరలేదని విమర్శించారు. అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న పాఠశాలలకు అద్దె, కరెంటు బిల్లుల బకాయిలు చెల్లించాలని, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాలు జరపాలని దశలవారీ పోరాటానికి పిలుపునిచ్చారు. ఈ నెల 27, 28 తేదీల్లో మున్సిపాల్టీల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించాలని, 29న డిఇఒ, కలెక్టర్లకు నోటీసులు అందిస్తామని తెలిపారు. డిసెంబరు ఒకటిన పాఠశాల విద్యాశాఖ కమిషనరుకు నోటీసు ఇస్తామన్నారు. 5న మున్సిపల్ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, 12, 13 తేదీల్లో అన్ని మున్సిపాల్టీల్లో ప్రచారం, 15న జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేపడతామని, 20 నుంచి 23 వరకు జిల్లాల సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ కార్యదర్శి ఎస్‌పి మనోహర్‌కుమార్, ప్రచురణ కమిటీ ఛైర్మన్ ఎం హనుమంతరావు, ఎన్‌టిఆర్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె శ్రీనివాసరావు, ఎ సుందరయ్య పాల్గొన్నారు.