ఫిషింగ్‌ హార్బర్‌ బోట్లు దగ్ధం కేసులోఇద్దరు అరెస్టు

ప్రజాశక్తి- ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం)గత ఆదివారం అర్ధరాత్రి ఫిషింగ్‌ హార్బర్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో దగ్ధమైన బోట్ల కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు వివరాలను విశాఖ సిటీ పోలీసు కమిషనర్‌ ఎ.రవిశంకర్‌ శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ ప్రమాదంలో ప్రధాన నిందితులుగా వాసుపల్లి నాని, ఆయన మామయ్య అల్లిపిల్లి సత్యంలను గుర్తించామని తెలిపారు. సంఘటన జరిగిన రోజున ఉదయం పది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు అల్లిపిల్లి వెంకటేష్‌కు చెందిన 887 నెంబర్‌ బోటులో వీరు ఉన్నారని, అక్కడే మద్యం సేవిస్తూ, సిగరెట్లు కాల్చారని చెప్పారు. సిగరెట్‌ను ఆర్పకుండా పక్కనే ఉన్న మున్నెం హరి సీతారాంకు చెందిన 815 నెంబరు బోటులో విసిరేశారన్నారు. అక్కడ నైలాన్‌ వలకు నిప్పు అంటుకొని చిన్నగా పొగ మొదలైందని, అదే సమయంలో ఆ ప్రాంతమంతా సముద్రంపై గాలులు వీయడంతో మంటలు పెరిగాయని తెలిపారు. వాటిని చూసి వీరు భయపడి పారిపోయారని చెప్పారు. ఈ ప్రమాదం అనుకోని విధంగా జరిగినప్పటికీ ఆ ప్రాంతంలో అనేక భద్రతా, పర్యవేక్షణ లోపాలు ఉన్నాయని గుర్తించామని పోలీసు కమిషనర్‌ వెల్లడించారు. కేసు విచారణకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, వారు సిపి టివి కెమెరాల ఫుటేజీలను పరిశీలించి 20 మంది అనుమానితులను విచారించారని తెలిపారు. ఈ క్రమంలోనే కేసును ఛేదించామని చెప్పారు. యూట్యూబర్‌ నానికి సంబంధం లేదు సంఘటన జరిగిన అనంతరం ప్రసార మాధ్యమాల్లోనూ, స్థానికంగా అందిన ప్రాథమిక సమాచారం మేరకు విచారణలో భాగంగా యూట్యూబర్‌ నానిని అదుపులోకి తీసుకున్నామని పోలీసు కమిషనర్‌ చెప్పారు. విచారణ తరువాత ఆయనను నిరపరాధిగా నిర్ధారించామని తెలిపారు. తాజాగా ఆయన స్నేహితులు హైకోర్టులో వేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌కు కూడా తాము సమాధానం ఇచ్చామని చెప్పారు. ఆందోళనకు దిగిన నిందితుల బంధువులుహార్బర్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదానికి కారకులుగా భావిస్తూ వాసుపల్లి నాని, అల్లిపిల్లి సత్యంలను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ వారి కుటుంబీకులు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. ఘటన సమయంలో అసలు వాళ్లు అక్కడ లేరని, తప్పుడు సాక్ష్యాలతో అరెస్ట్‌ చేసారని పేర్కొంటూ కొందరు మహిళలు రోడ్డుపై బైఠాయించారు. పోలీసుల తీరుపై భిన్న కథనాలు ఈ ప్రమాదంపై పోలీసులు తీరుపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. సిసి టివి ఫుటేజీలు, ప్రాథమిక సమాచారం ఉందని అధికారులు తెలిపినప్పటికీ వివరాలు వెల్లడించేందుకు ఆరు రోజుల సమయం తీసుకోవడం, విచారణలో జాప్యం పలు అనుమానాలకు దారితీస్తోందని స్థానికులు అంటున్నారు. కేసును ఎలాగైనా క్లోజ్‌ చేయాలన్న తలంపు పోలీసుల్లో కనిపించిందని కొందరు ఆరోపిస్తున్నారు. సంఘటన జరిగిన రెండో రోజు జిల్లా కలెక్టర్‌ ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ నివేదిక, విచారణపై పోలీసులు ఎటువంటి వివరణా ఇవ్వకపోవడం వంటి అంశాలు ఈ ప్రమాద సంఘటనను ముగించే ప్రయత్నమేనని అంటున్నారు.

➡️