నిరుద్యోగంలో తెలంగాణ మొదటిస్థానం : టీపీసీసీ చీఫ్‌

Nov 20,2023 15:27 #revanth reddy

హైదరాబాద్‌ : నిరుద్యోగంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. సోమవారం నర్సాపూర్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ విజయభేరీ యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చి తొమ్మిదిన్నరేళ్లయిందని, ఈ సమయంలో కేసీఆర్‌ కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలేదన్నారు. నిరుద్యోగంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని.. రైతుల ఆత్మహత్యలు పెరిగాయని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ ఇచ్చిన ఏ హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. వచ్చే నెలలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. రైతులకు, ఉపాధి కూలీలకు, రైతు కూలీలకు కూడా అండగా ఉంటామన్నారు. గృహలక్ష్మి పథకం కింద పేదల ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, మహిళలకు రూ.2500 అందిస్తామన్నారు. కేసీఆర్‌ చెప్పిన డబుల్‌ బెడ్రూం ఇళ్ళు ఎవరికీ రాలేదని, కానీ పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షల చొప్పున అందిస్తుందన్నారు. వచ్చే నెల కాంగ్రెస్‌ గెలుస్తుందని, అప్పుడు పెన్షన్‌ రూ.4వేలకు పెంచుతామన్నారు. గ్యాస్‌ సిలిండర్‌ రూ.500కే అందిస్తామని హామీ ఇచ్చారు.

➡️