ఎర్ర జెండాతోనే బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి : బృందాకరత్
ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : ప్రజా పోరాటాలు చేస్తూ పేద ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతున్న సిపిఎంని ఆదరించాలని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యు లు, మాజీ ఎంపి బృందా కరత్ కోరారు. సిపిఎం భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కారం పుల్లయ్య విజయాన్ని కాంక్షిస్తూ సోమవారం చర్ల మండల కేంద్రంలో మండల కార్యదర్శి కారం నరేష్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లా డారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎర్రజెండాను గెలిపించుకో వాలని పిలుపుని చ్చారు. ప్రజల పక్షాన గళం వినిపించడానికి అసెంబ్లీలో సిపిఎం ప్రాతినిధ్యం ఉండాలన్నారు. తెలంగాణ లో జనాభా లెక్కల ప్రకారం 119 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నందున అసెంబ్లీలో కనీసం 17 మంది గిరిజన ఎమ్మెల్యేలు ఉండాలని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం నిరుద్యోగ సమస్య మరింత పెరిగిందన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసి, పోరాటాలు చేసింది ఎర్రజెండానేనని గుర్తు చేశారు. మాజీ ఎంపి డాక్టర్ మిడియం బాబురావు, తాను కలిసి అటవీ హక్కుల చట్టాన్ని 2006లో తీసుకొచ్చేందుకు కృషి చేశామని గుర్తు చేశారు. అటవీ ప్రాంతంలో ఆదివాసీల హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హరిస్తున్నాయన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చి దశాబ్దాలుగా జీవనం గడుపుతున్న వారికి కుల ధ్రువీకరణ పత్రాలు నిలిపివేయడాన్ని తప్పు పట్టారు. వలసవాదుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న నాటకానికి చరమ గీతం పాడాలన్నారు. పేదల పక్షాన నిలబడి వారి కోసం పోరాటం చేస్తోన్న కారం పుల్లయ్యను గెలిపించి అసెంబ్లీకి పంపాలని కోరారు.
ఉపాధి చట్టం తెచ్చిన కమ్యూనిస్టులకు పట్టం కట్టండి : బి.వెంకట్
సబ్బండ వర్గాలకు ఎంతో జీవనోపాధి అందిస్తోన్న ఉపాధి హామీ చట్టాన్ని తెచ్చిన సిపిఎంకు పట్టం కట్టాలని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్ విజ్ఞప్తి చేశారు.పోడు భూముల చట్టాన్ని ప్రతిష్టంగా అమలు చేయడానికి కారం పుల్లయ్య నిర్విరామంగా కృషి చేశారని వివరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపి మిడియం బాబూరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, బండారు రవికుమార్, ఎమ్మెల్యే అభ్యర్థి కారం పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.