ఎంఎల్‌ఎ కన్నబాబు సోదరుడే కారణమని మృతుని తల్లి ఆరోపణ
ప్రజాశక్తి- కాకినాడభూమి విక్రయంలో తనను మోసగించారనే మనస్తాపంతో కాకినాడలో ఒక యువ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఎంఎల్‌ఎ కన్నబాబు సోదరుడు కల్యాణ్ కృష్ణ వల్లే తన కుమారుడు బలవన్మరణానికి పాల్పడినట్టు మృతిని తల్లి ఆరోపించారు. దీంతో, ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. వైద్యుని తల్లి కథనం ప్రకారం… కాకినాడలోని అశోక్ నగర్ గోకులం సమీపంలో డాక్టర్ నున్న కిరణ్ చౌదరి తన తల్లి శేషారత్నంతో కలిసి నివసిస్తున్నారు. ఆయన జిజిహెచ్‌లో మార్చురీ విభాగంలో పని చేస్తున్నారు. శనివారం రాత్రి తన ఇంట్లో పురుగు మందుతాగి విగతజీవిగా పడిపోయారు. దీన్ని తల్లి గమనించి ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమించి ఆదివారం మృతి చెందారు. గొల్లప్రోలు మండలం చందుర్తి, కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కోరాడ గ్రామంలో ఉన్న సుమారు 12.50 ఎకరాల భూమిని కిరణ్ అమ్మకానికి పెట్టారు. సామర్లకోట మండలం అచ్చంపేటకు చెందిన పెదబాబుకు ఈ భూమికి సంబంధించిన దస్తావేజులు అప్పగించారు. ఆ తర్వాత వారు డబ్బులు చెల్లించకుండా ఎదురు తిరగడంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వ్యవహారంలో కాకినాడ రూరల్ ఎంఎల్‌ఎ సోదరుడు కల్యాణ కృష్ణ పాత్ర కీలకంగా ఉందని కిరణ్ తల్లి ఆరోపించారు. ఇప్పటికే భూ విక్రయాల్లో ఎంఎల్‌ఎ కన్నబాబు ప్రధాన అనుచరుడు గాలిదేవర బాలాజీ కూడా కూరాడ భూమి విక్రయానికి సంబంధించి డబ్బులు ఇవ్వకుండా తన కుమారుడిని ఇబ్బందులకు గురి చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుని మృతికి కారణమైన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. రష్యాలో వైద్య విద్య అభ్యసించిన కిరణ్ అవివాహితులు.