పోస్టుల భర్తీలో ప్రభుత్వం ఉదాసీనత
ఇన్‌ఛార్జులతో నెట్టుకొస్తున్న దుస్థితి
అస్తవ్యస్తంగా నిర్వహణ
ప్రజాశక్తి-విజయవాడ ప్రతినిధి : వెనుకబడిన తరగతుల ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో వార్డెన్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది సరిపడిన సంఖ్యలో వార్డెన్లు లేకపోవడంతో హాస్టళ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఒక్కో వార్డెన్ రెండు వసతి గృహాలకు, కొన్నిచోట్ల మూడు వసతి గృహాలకు ఇన్‌ఛార్జులుగా ఉంటుండడంతో విద్యార్థుల పర్యవేక్షణ వారికి తలకు మించిన భారంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే దుస్థితి ఉంది. 13 ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లతో కలిపి రాష్ట్రంలో 747 ప్రీ మెట్రిక్ వసతి గృహాలు ఉన్నాయి. వీటిల్లో 559 బాలురవి, 188 బాలికలవి. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే పిల్లలకు వీటిల్లో ప్రవేశాలు కల్పించారు. ప్రభుత్వ, మున్సిపల్, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల విద్యార్థులను వసతి గృహాల్లో చేర్చుకున్నారు. వీటితోపాటు ఇంటర్ నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ వరకు చదివే వారికి 362 కళాశాల వసతి గృహాలు ఉన్నాయి. వీటిల్లో సుమారు 93 వేల మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ఒక్కో వసతి గృహానికీ ఒక్కో వార్డెన్ అవసరం. ఈ లెక్కన 747 ప్రీ మెట్రిక్ వసతి గృహాలకు 747 మంది, 362 పోస్టు మెట్రిక్ హాస్టళ్లకు 362 మంది ఉండాలి. పోస్టు మెట్రిక్‌తోపాటు ప్రీ మెట్రిక్‌లో వసతి గృహాల్లో కూడా సరిపడిన సంఖ్యలో వార్డెన్లు లేరు. కళాశాల వసతి గృహాల్లో 25 శాతం, ప్రీ మెట్రిక్ హాస్టళ్లలో దాదాపు 400 వార్డెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో, విద్యార్థుల పర్యవేక్షణ, వారికి మెనూ ప్రకారం అందించాల్సిన ఆహారం, ఇతర వసతులు, సిబ్బంది హాజరు, పర్యవేక్షణ కష్టంగా మారింది. ఉన్న వార్డెన్లకే రెండు, మూడు వసతి గృహాల బాధ్యతలను అధికారులు బలవంతంగా అప్పగించారు. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం పూనుకోవడం లేదు. గత నాలుగేళ్లుగా ఇన్‌ఛార్జులతోనే వసతి గృహాలను నెట్టుకొస్తోంది. 747 ప్రీ మెట్రిక్ వసతి గృహాల్లో 545 వసతి గృహాలకు ప్రభుత్వ భవనాలను నిర్మించగా, 202 వసతి గృహాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటికి సొంత భవనాల నిర్మాణంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.