రాష్ట్రంలో అడ్డగోలుగా ఇసుక దందా సాగుతోంది: పురందేశ్వరి

Nov 18,2023 15:51 #press meet, #purandeswari

బుర్రిలంక: రాష్ట్రంలో అడ్డగోలుగా ఇసుక దందా సాగుతోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం బురిలంక రేవు వద్ద ఇసుక తవ్వకాలను బిజెపి, జనసేన నేతలతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి నర్సరీ రైతులు ఇసుక అక్రమాలను ఇరు పార్టీల నేతలకు వివరించారు. దశాబ్దాలుగా ఇలాంటి ఇసుక దందా చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికైనా చెప్తే చంపేస్తాం, కాల్చిపారేస్తాం అనేలా బెదిరిస్తున్నారని వాపోయారు. అనంతరం పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రాలో ఇసుక సరఫరా దోచుకో దాచుకో అన్న చందాన జరుగుతోందని మండిపడ్డారు. జేపీ సంస్థ ముసుగులో అడ్డగోలుగా ఇసుక దందా సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇసుక దోపిడీలో వచ్చే సొమ్మంతా తాడేపల్లికే వెళ్తోందన్నారు. ”నదీ గర్భంలో యంత్రాలతో తవ్వకాలు చేయొద్దన్న హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాలను ప్రభుత్వం తుంగలో తొక్కింది. ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాలకు ఇచ్చిన అనుమతులు మే నెలతో పూర్తి అయ్యాయి. నేటికీ ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలు కొనసాగుతుండడం వైసిపి ప్రభుత్వ దోపిడీకి అద్దం పడుతోంది” అని పురందేశ్వరి వ్యాఖ్యానించారు.

➡️