యూనిట్‌ రూ.7.75కు కొనుగోలు

Nov 28,2023 09:40 #discam, #megawatt
  • స్వల్పకాలికం పేరుతో డిస్కాంలు ఒప్పందం
  • సెంబ్‌కార్ప్‌ నుంచి మరో 625 మెగావాట్లు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్‌ వినియోగదారులపై భారాలు మోపే విధంగా డిస్కంలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. స్వల్పకాలికం ఒప్పందాల కింద అధిక ధరకు విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నాయి. వేసవి పేరుతో కొనుగోలు చేస్తున్నామని చెబుతూ మార్చి వరకే ఈ ఒప్పందాలు చేసుకున్నాయి. అక్టోబర్‌ నుంచి మార్చి వరకు 3,830 మిలియన్‌ యూనిట్లు(ఎంయు)ను రూ.7.75ల చొప్పున డిస్కంలు ఒప్పందాలు చేసుకున్నాయి. తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌లోని 8 విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలతో డిస్కంలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ప్రతినెలా 100 మెగావాట్లు చొప్పున వీటి నుంచి తీసుకోనున్నాయి. ఇది కాకుండా నెల్లూరు జిల్లాలో ఉన్న సెంబ్‌కార్ప్‌ ప్రైవేట్‌ థర్మల్‌ ఉత్పత్తి కేంద్రం నుంచి మరో 625 మెగావాట్ల(మెవా)ను డిస్కంలు యూనిట్‌కు రూ.3.84లు చొప్పున కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నాయి. వేసవి పేరు చెబుతూ మార్చి వరకే ఒప్పందంరానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని కొనుగోలు చేస్తున్నామని విద్యుత్‌శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే అక్టోబర్‌ నుంచే రూ.7.75 చెల్లించాల్సిన అవసరం ఏమిటో అర్థం కావడం లేదు. 2023-24 టారీఫ్‌ ఆర్డర్‌లో యూనిట్‌ ధర రూ.4.80 చొప్పున కొనుగోలు చేసేందుకు ఎపిఇఆర్‌సి డిస్కంలకు అనుమతి ఇచ్చింది. అనుమతినిచ్చిన ధరకంటే అదనంగా రూ.2.95లకు ఒప్పందం కుదుర్చుకున్నా పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ ఏడాది అక్టోబర్‌లో రోజువారీ డిమాండ్‌ 230 వరకు చేరుకుంది. ప్రస్తుతం వాతవరణం చల్లగా ఉండటంతో ఈ డిమాండ్‌ 195 ఎంయుల వరకే ఉంది. బొగ్గు ప్లాంట్ల నుంచి 100 ఎంయులు, సోలార్‌, విండ్‌ కలిపి 30 ఎంయు, కేంద్ర ఉత్పత్తి సంస్థల నుంచి 55 ఎంయుల వరకు డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యుత్‌ అందుతోంది. డిసెంబర్‌, జనవరిలో డిమాండ్‌ ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు వేసవి కాలం పీక్‌ డిమాండ్‌ కూడా ఏప్రిల్‌, మే నెలల్లో అధికంగా ఉంటుంది. ఒప్పందం మాత్రం మార్చి వరకే డిస్కంలు చేసుకున్నాయి. ఏప్రిల్‌, మే నెలల కోసం ఎలాంటి కొత్త ఒప్పందాలు చేసుకోలేదు. రేపు ఎపిఇఆర్‌సికి ఎఆర్‌ఆర్‌ ప్రతిపాదనలుఎపిఇఆర్‌సికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వార్షిక నివేదిక(ఎఆర్‌ఆర్‌)ను మూడు డిస్కంలు సమర్పించనున్నాయి. హైదరాబాద్‌లోని ఇఆర్‌సి కార్యాలయంలో బుధవారం వీటిని కమిషన్‌కు అందించనున్నాయి.

➡️