బర్రెలక్కకు భద్రత కల్పించండి : పోలీసులకు హైకోర్టు ఆదేశం

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో: కొల్లాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న శిరీష అలియాస్‌ బర్రెలక్కకు రక్షణ కల్పించాలని హైకోర్టు రాష్ట్ర డిజిపిని ఆదేశించింది. తాను ప్రచారం చేయకుండా కొంతమంది అడ్డుకుంటున్నారని, తన సోదరుడిపై దాడి చేశారని, అయినప్పటికీ పోలీసులు రక్షణ కల్పించలేదంటూ బర్రెలక్క దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్‌ సివి. భాస్కర్‌ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. అభ్యర్థుల రక్షణ బాధ్యత పోలీసులదేనని స్పష్టం చేసింది. కార్లు తనిఖీలు చేయడమే కాదు.. అభ్యర్థులకు రక్షణ కూడా కల్పించాలని పేర్కొంది. పోలీసులు రక్షణ కల్పించలేమని చెబితే తాము ఇసి ద్వారా కేంద్ర బలగాలను రక్షణగా ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు ఇవ్వాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ అభ్యర్థులకు రక్షణ కల్పిస్తున్నట్టు పోలీసుల తరఫున తెలియజేశారు. డిగ్రీ చదివి ఉద్యోగం లేక బర్రెలతో ఉపాధి పొందుతున్న శిరీష గురించి సోషల్‌ మీడియాలో రావడంతో ఆమెకు లక్షల మంది ఫాలోవర్స్‌ తయారయ్యారు. తానలాంటి నిరుద్యోగులు పడుతున్న అవస్తలతో పాటు కొల్లాపూర్‌ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను ప్రశ్నిస్తూ ఆమె ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగారు. బర్రెలక్క నామినేషన్‌ వేస్తున్న విషయం తెలియగానే.. ఆమె ఫాలోవర్స్‌, నిరుద్యోగులు, ప్రొఫెసర్లు, లాయర్లు, అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇదే సమయంలో ఆమెకు అనేక విధాలుగా అడ్డంకులు వచ్చాయి. బర్రెలక్క కుటుంబ సభ్యులతో పాటు ఆమెకు సహకరిస్తున్న వారిపై దాడులు జరగడంతో ఆమె రక్షణ కోసం హైకోర్టును ఆశ్రయించారు.

➡️