ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు జిల్లా): శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ దళితులు బుధవారం గుంటూరు జిల్లా తెనాలిలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద మృతదేహంతో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెనాలి చెంచుపేటకు చెందిన టి.కాశయ్య గుండెపోటుతో మృతి చెందారు. ఖననం చేసేందుకు స్థలం లేకపోవడంతో సమీపంలోని ఇతర శ్మశానవాటికల్లో ఖననం చేసేందుకు కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకెళ్లారు. ఆయా ప్రాంతాల పెద్దలు అంగీకరించకపోవడంతో శ్మశానవాటిక కోసం ఆందోళన చేశారు. ఆ సమయంలో తహశీల్ధార్, డిప్యూటీ తహశీల్ధార్ అందుబాటులో లేకపోవడంతో కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చి వెళ్లిపోయారు. అనంతరం గురవయ్య కాలనీ శివారులోని శ్మశాన వాటికలో మృతదేహాన్ని ఖననం చేశారు. ఎంఆర్‌పిఎస్ నాయకులు చిలకా కిరణ్ మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెనాలి వచ్చిన సందర్భంగా దళితుల శ్మశాన వాటిక కోసం రూ.9 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారని, ఇప్పటికీ అధికారులు శ్మశానాలకు స్థలాల కొనుగోలు చేయలేదని విమర్శించారు. దీనిపై జాప్యం ఎందుకని ప్రశ్నించారు. కార్యక్రమంలో బి.కోటయ్య, పి.క్రాంతి, బ్లేస్సి, జాన్సన్, కిషోర్, పవన్, మృతుని బంధువులు పాల్గొన్నారు.