తారా స్థాయికి ప్రచారం

Nov 28,2023 10:15 #Election Campaign, #Telangana

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరాం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నా… తెలంగాణ రాజకీయంపైనే దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ కంటే తెలంగాణ చిన్న రాష్ట్రమైనా జాతీయ రాజకీయాలను తెలంగాణ ఫలితాలు ప్రభావితం చేస్తాయని అందరూ భావిస్తున్నారు. అందుకే బిజెపి, కాంగ్రెస్‌ వంటి జాతీయ పార్టీలతో సహా అధికార బిఆర్‌ఎస్‌, ఎంఐఎం, బిఎస్‌పి పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి పోలింగ్‌ రోజు వరకూ ఎత్తుకుపైఎత్తులు వేస్తూ ఎవరికి వారు పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. కొద్ది రోజుల్లో జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికలకు ఈ ఐదు రాష్ట్రాల పోలింగ్‌ను రిహార్సల్స్‌గా భావిస్తుండడంతో అందరి దృష్టి వీటిపై పడింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జత కట్టిన సిపిఐ, ప్రజాపోరాటాలనే నమ్ముకుని ఒంటరిగా బరిలోకి దిగిన సిపిఎం, ప్రజాపంథా, న్యూడెమొక్రసీలు కూడా తమ అజెండాలతో ప్రజల దగ్గరకు వెళ్తున్నాయి. బూర్జువా పార్టీల హామీలు, విధానాల్లో వాస్తవాలను వివరిస్తూ అన్ని వర్గాల సమగ్రాభివృద్ధి నమూనాలను వివరిస్తున్నాయి. సిపిఎం బరిలో ఉన్న 19 నియోజకవర్గాల్లో అక్కడి ప్రజా సమస్యలపై ఆ పార్టీ అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో సమస్యలపై సిపిఎం చేసిన ప్రజా ఉద్యమాలను ప్రజలకు వివరిస్తున్నారు. సిపిఎం అగ్ర నాయకులు సీతారాం ఏచూరి, బృందా కరత్‌, బివి రాఘవులు, సుభాషిణీ అలీ, త్రిపుర మాజీ సిఎం మాణిక్‌ సర్కార్‌, మాజీ ఎంపి పి.మధు తదితరులు ప్రచారం నిర్వహించారు. డబ్బే కేంద్రంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో కూడా ఎర్రజెండా పార్టీలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దళితులు, బిసిలపై బిఎస్‌పి ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆ పార్టీ అధినేత్రి మాయావతి తమ అభ్యర్థుల తరుఫున ప్రచారం నిర్వహించారు. బిఆర్‌ఎస్‌ మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం పాతబస్తీలోని ఏడు స్థానాలతో పాటు రాజేంద్ర నగర్‌, జూబ్లిహిల్స్‌లో కూడా బరిలో ఉంది.

బిఆర్‌ఎస్‌ నేతల్లో గుబులు

స్థానిక సర్వేలు అటుఇటుగా ఉన్నా బిఆర్‌ఎస్‌ నేతల్లో భయం స్పష్టంగా కనిపిస్తోంది. సిఎం కెసిఆర్‌, మంత్రులు కెటిఆర్‌, హరీశ్‌, కవిత మాత్రమే రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు. తెలంగాణ తెచ్చిన పార్టీగా బిఆర్‌ఎస్సే తెలంగాణకు రక్ష అంటూనే గత పదేళ్ల అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో పరిస్థితి అనుకూలంగా లేదని సర్వే రిపోర్టులు తేల్చడంతో కెసిఆర్‌ నష్ట నివారణ చర్యల్లో నిమగమయ్యారు.

కాంగ్రెస్‌ ఆశలు

కర్ణాటక ఫలితాలు తెలంగాణ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని కాంగ్రెస్‌ పార్టీ ఆశగా ఉంది. గత అనుభవాల దృష్ట్యా పార్టీ హైకమాండ్‌ తీసుకున్న జాగ్రత్తలు, టికెట్ల కేటాయింపు, నాయకుల్లో వచ్చిన మార్పు, ప్రభుత్వ వ్యతిరేకత, పార్టీ వీడి వెళ్లిపోయిన నాయకులు తిరిగిరావడం వంటివి కలిసి వస్తాయని ఆ పార్టీ భావిస్తోంది. ఆరు గ్యారెంటీల స్కీమ్‌పై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతి, నిరుద్యోగ సమస్యతోపాటు బిజెపితో మిలాఖత్‌పై ఆ పార్టీ అగ్ర నేతలు రాహుల్‌ గాంధీ, సోనియా ప్రియాంక, ఖర్గే, కర్ణాటక సిఎం సిద్ధరామయ్య, ఛత్తీస్‌గఢ్‌ సిఎం భూపేశ్‌ బగేల్‌ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే అంచనాలతో కాంగ్రెస్‌ పార్టీ ఉంది.

పట్టుమని పది సీట్లు లేవు… మరి సిఎం ఎలా?

బిజెపి మేనిఫెస్టో హామీల నుంచి ప్రచారంలో ఆ పార్టీ హేమాహేమీల ఉపన్యాసాలు విని తెలంగాణ ఓటర్లు నవ్వుకుంటున్నారు. బిజెపికి పట్టుమని పది సీట్లు కూడా రావు కానీ, ప్రభుత్వాన్ని ఏ విధంగా ఏర్పాటు చేస్తారు? బిసి నేతను సిఎం ఎలా చేస్తారు? అని ప్రశ్నిస్తున్నారు. ప్రధాని మోడీ, అమిత్‌ షా, నడ్డా, బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు కేంద్ర మంత్రులు ఇక్కడే మకాం వేసి మేమే గెలుస్తున్నామంటూ ఊదరగొడుతున్నారు. స్వప్రయోజనాల కోసం బిజెపితో బిఆర్‌ఎస్‌ రహస్య ఒప్పందం చేసుకుందన్న ప్రచారం రాష్ట్రమంతటా జోరుగా సాగుతోంది. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన తర్వాత ఐదు పర్యాయాలు తెలంగాణలో పర్యటించిన మోడీ పది బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ప్రచారానికి మంగళవారం చివరిరోజు కావడంతో ఆయా పార్టీల క్యాడర్‌ అంతా పోల్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించింది.

➡️